ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ఆక్రమణ .. హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు

ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ఆక్రమణ .. హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేస్తే కుల, మత సంఘాలను వెనుకేసుకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారని, కాలనీలు, బస్తీలతో పాటు కొత్తగా వచ్చిన గేటెడ్ కమ్యూనిటీలు, హెచ్ ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలో కూడా  ఇదే దందా కొనసాగుతోందని పలువురు కాలనీ, బస్తీవాసులు  హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు రాగా,  ఇందులో రోడ్లు, నాలాలు ఆక్రమణలకి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. 

కూకట్ పల్లి  నియోజకవర్గ పరిధిలోని ఆంజనేయ నగర్ లో ఎకరం పార్కులో జెండా పాతి కొంతమంది కబ్జాకు పాల్పడుతున్నారని, సికింద్రాబాద్ చికోటీ గార్డెన్స్ పరిసరాల్లో గుడికి అనుసంధానంగా షెడ్లు వేసి రోడ్డును ఆక్రమిస్తున్నారని, పటాన్ చెరు ప్రాంతంలో 500 విల్లాలున్న ఏపీఆర్ ప్రవీణ్ లగ్జీరియాలో కూడా ఎకరం పార్కు స్థలంలో కొంతమేర గుడి కట్టి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణికి వచ్చి ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ పరిశీలించారు. 

గూగుల్ మ్యాప్స్ ద్వారా  పరిస్థితిని ఫిర్యాదుదారులకు వివరించి.. సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, సొసైటీలు ఖాళీ స్థలాలను ప్లాట్లుగా అమ్ముకుంటే వారిపైన చర్యలు తీసుకోవాలని పలువురు అసెట్ ప్రొటెక్షన్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.