హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది.
నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మెట్రో ఫేజ్-1ను ఇకపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 29న బుధవారం రాష్ట్ర సచివాలయంలో చారిత్రాత్మక షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ మెట్రోకు ఉన్న వంద శాతం షేర్లను సుమారు రూ.1,461 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే సంస్థపై ఉన్న రూ.13,538 కోట్ల అప్పును ప్రభుత్వం తన హామీతో రీఫైనాన్స్ చేయనుంది. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా IDBI Capital వ్యవహరించగా.. లీగల్ అడ్వైజరీ సేవలను Saraf & Partners సంస్థ అందించింది.
2017 నవంబర్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తోంది. రోజుకు దాదాపు 4.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ, ఇప్పటివరకు 86 కోట్ల ప్రయాణాలను నమోదు చేసింది.
ఫేజ్-1 ప్రభుత్వ హస్తగతం కావడంతో రాబోయే ఫేజ్-2 పనుల రూపకల్పన, అమలు సేవల సమన్వయం మరింత సులభతరం కానుంది. భవిష్యత్తులో భాగ్యనగర వాసులకు మరింత సమగ్రమైన, నమ్మకమైన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో నెట్‌వర్క్‌ను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

