V6 News

బెంగళూరులో గాలి వాన బీభత్సం..ఆస్పత్రి కాంపౌండ్‌ వాల్‌ కూలి..ముగ్గురు పిల్లలతో సహా 8మంది మృతి

బెంగళూరులో గాలి వాన బీభత్సం..ఆస్పత్రి కాంపౌండ్‌ వాల్‌ కూలి..ముగ్గురు పిల్లలతో సహా 8మంది మృతి

బెంగళూరులో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బెంగళూరు సిటీని అతలాకుతలం చేసింది. గాలివానకు ఓ ఆస్పత్రి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. గోడ శిథిలాల కింద పడి ముగ్గురు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఆకస్మాత్తుగా జరిగిన  ఈఘటనతో ఆస్పత్రి పరిసరాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది  ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మృతదేహాలను వెలికి తీశారు. వివరాల్లోకి వెళితే..

బుధవారం(ఏప్రిల్ 29) సాయంత్రం  బెంగళూరు  సిటీలోని బౌరింగ్, లేడీ కర్జాన్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం భారీ వర్షం, పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కర్జాన్ ఆస్పత్రి పరిసరాల్లో భయానక వాతావరణం నెలకొంది. గాలివానకు భయంతో ఆస్పత్రి కాంపౌండ్ వాల్ సమీపంలో తల దాచుకున్న ఎనిమిది మందిపై ఆకస్మాత్తుగా గోడ కూలింది. దీంతో ఎనిమిదిమంది స్పాట్ లో చనిపోయారు. బాధితులంతా వీధి వ్యాపారులుగా బెంగళూరు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకన్న పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  బుల్డోజర్ తో  గోడ శిథిలాల కిందనుంచి మృత దేహాలను వెలికి తీశారు. 

బెంగళూరులో గంటన్నర వ్యవధిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బీబీఎంపీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రకారం, 50 చోట్ల చెట్లు కూలిపోయాయి.