దేవుడి భూములను చెరపట్టిన్రు!

దేవుడి భూములను చెరపట్టిన్రు!
  • అన్యాక్రాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లోని మరో 6 వేల ఎకరాలు

  • ఆలయ భూముల రక్షణకు డిఫ్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్​ టీమ్

  • ఇప్పటివరకు 50 వేల ఎకరాలకు జియో ట్యాగింగ్​

  • ఫీల్డ్​లో ఆఫీసర్లు, సిబ్బందిపై కబ్జాకోర్ల దాడులు

  • సర్వేయర్లు, పోలీసు ప్రొటెక్షన్  కోరుతున్న ఎండోమెంట్​ ఆఫీసర్లు

  • రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 ఎకరాలు

  • అక్రమార్కుల చెరలో 25,000 ఎకరాలు

హైదరాబాద్, వెలుగు: గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూముల ధరలు పెరగడం.. అడిగేవారు, పర్యవేక్షించేవారు లేకపోవడంతో అక్రమార్కులు అందినకాడికి కబ్జాచేశారు. ముఖ్యంగా అప్పటి అధికారపార్టీ నేతలు, రాజకీయ పలుకుబడి కలిగినవాళ్లు, రియల్టర్లు ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ ఆదేశాలతో ఎండోమెంట్​ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా జాయింట్ సర్వే చేపట్టారు. రికార్డుల ప్రకారం దేవాదాయ శాఖకు మొత్తం 91,827 ఎకరాల భూములు ఉండగా, ఇందులో సుమారు 25 వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆయా భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకొని మొత్తం ఎండోమెంట్ భూములను జియోట్యాగింగ్ ​చేయాలన్న సీఎం ఆదేశాలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్​గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ భూముల స్వాధీనం, పర్యవేక్షణ కోసం డిప్యూటీ కలెక్టర్​నేతృత్వంలో నలుగురు డిప్యూటీ తహసీల్దార్లతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 50వేల ఎకరాలకు జియోట్యాగింగ్ చేశారు. భూముల స్వాధీనానికి వెళ్తున్న అధికారులు, సిబ్బందిపై కబ్జాదారులు దాడులకు దిగుతుండడంతో తాజాగా సర్వేయర్లు, పోలీస్​ప్రొటెక్షన్​ కోసం సర్కారుకు దేవాదాయశాఖ ప్రతిపాదనలు పంపించింది.

భూముల్లో బోర్డుల ఏర్పాటు

అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ డిప్యూటీ కలెక్టర్(డీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. డీసీ నేతృత్వంలో నలుగురు డిప్యూటీ తహసీల్దార్లతో కూడిన ఈ బృందం కబ్జాకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆ భూములకు హద్దులు నిర్ణయించి, హద్దు రాళ్లు పాతుతున్నది. ఒకవేళ ఎక్కడైనా భూమి కబ్జాకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఫలానా ఆలయానికి సంబంధించిన భూమి అని ఆయాచోట్ల బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. ఆ తర్వాత ఆయా భూములను ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎండోమెంట్​అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో, జిల్లా అధికారి, మండలస్థాయిలో ఈవోలు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈవోలకు ఒక్కొక్కరికి ఐదారు మండలాల  బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కోర్టు కేసులతో స్వాధీనం ఆలస్యం

ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేక్రమంలో అధికారులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఆక్రమణ దారులు కోర్టులను ఆశ్రయిస్తుండడం, ఆయా కేసులు ఏండ్లుగా పెండింగ్​లో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేవుడి మాన్యాలు ఎక్కడెక్కడ? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయో గుర్తించి జియోట్యాగింగ్​ చేపడుతున్నారు. దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఎండోమెంట్​శాఖకు 91,827 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 25,066.69 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటివరకు 
దాదాపు 50 వేల ఎకరాల ఆలయ భూములకు జియోట్యాగింగ్ చేపట్టారు. కొన్నిచోట్ల కోర్టు కేసులు, ఇతర ఇబ్బందులు ఉండడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇక పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, కర్నాటకతోపాటు పలు రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల ఎకరాల భూములున్నాయి. భద్రాచలం రాములోరి ఆలయ భూములు అత్యధికంగా ఏపీలో ఉండగా.. నిజామాబాద్, ఆదిలాబాద్​కు చెందిన  పలు ఆలయాల భూములు మహారాష్ట్రలో ఉన్నాయి.  పర్యవేక్షణ లేకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. 

భద్రాచలం రామాలయానికి ఏపీలోని యేటపాక మండలం పురుషోత్తపట్నంలో 899 ఎకరాల భూమి ఉంది. కొందరు కబ్జాదారులు ఈ భూములను ఆక్రమించి, బిల్డింగ్​లు నిర్మిస్తున్నారు. దీంతో ఇటీవల ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లిన సిబ్బందిపై కబ్జాకోర్లు దాడులకు దిగారు. కోర్టు తీర్పులు దేవస్థానానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎండోమెంట్​శాఖ పోలీస్ ప్రొటెక్షన్​ కోసం రెక్వెస్ట్​ చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే పోలీస్​బందోబస్తుతో వెళ్లి ​అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని అధికారులు భావిస్తున్నారు.