రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలున్నయ్

రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలున్నయ్

సూర్యపేట: దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సస్పెన్షన్‎కు గురైన బీజేపీ శాసనసభ్యులు న్యాయపోరాటం చేస్తామనడంపై ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళదినోత్సవం సందర్భంగా సూర్యపేట నియోజకవర్గంలోని కాసారా బాద్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘ప్రజారంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకుంటున్నాయి. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడంలేదు. సభలో నిలబడి మాట్లాడే ధైర్యంలేక సభను ఆడ్డుకుంటున్నారు. సభను సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తీర్మానాలను ఉల్లంఘించి బీజేపీ సభ్యులు వెల్‎లోకి దూసుకోచ్చారు. సభను అడ్డుకుంటామనే బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు. ప్రతి ఒక సభ్యుడు సభా మర్యాదలకు అనుగుణంగా నడుచుకోవాలి. కోర్టుకు వెళ్లినంత మాత్రాన ఏమీ జరగదు. కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణను శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేశాం’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.