మల్లారెడ్డి కాలేజీలో రూ.1.40 కోట్లు స్వాధీనం..ముగిసిన ఈడీ సోదాలు

మల్లారెడ్డి కాలేజీలో రూ.1.40 కోట్లు స్వాధీనం..ముగిసిన ఈడీ సోదాలు

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ కాలేజీల్లో ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌‌ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు గురువారంతో ముగిశాయి. పీజీ మెడికల్‌‌ సీట్ల బ్లాకింగ్‌‌ స్కామ్‌‌ దర్యాప్తులో భాగంగా మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌‌‌‌ రెడ్డి, కామినేని మెడికల్ సైన్సెస్‌‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 10 మెడికల్‌‌ కాలేజీలు వాటి డైరెక్టర్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు ప్రారంభించింది. గురువారం సోదాలు కంప్లీట్ కావడంతో అధికారులు వివరాలను వెల్లడించారు. మల్లారెడ్డి ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్ సైన్సెస్‌‌లో రూ.1.40  కోట్ల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్‌‌లోని రూ.2.89 లక్షలు ఫ్రీజ్ చేశారు. అన్ని కాలేజీలకు చెందిన హార్డ్‌‌డిస్క్‌‌లు, డిజిటల్ డివైజెస్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ స్టూడెంట్స్ వద్ద రూ.100 కోట్లకు పైగా ఫీజులు వసూ లు చేసినట్లు గుర్తించారు. సీట్లు, ఫీజులకు సంబంధించిన రికార్డ్స్‌‌ తమవెంట తీసుకెళ్లారు.

మెడికల్ సీట్లలో గోల్‌‌మాల్‌‌

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్‌‌ సీట్లు బ్లాక్‌‌ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్‌‌ గుర్తించింది. దీనిపై విచారణ జరిపింది. యూనివర్సిటీ కౌన్సెలింగ్‌‌కు కూడా అప్లై చేయని ఐదుగురు అభ్యర్థులను గుర్తించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ వారి రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు బ్లాక్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ, మేనేజ్‌‌మెంట్‌‌ కోటాలను సెలెక్ట్ చేసుకున్నట్లు గుర్తించింది. సంబంధిత విద్యార్థుల వివ రాలను సేకరించింది. ఇందులో ఐదుగురు కాళోజీ వర్సిటీలో కౌన్సెలింగ్​కు కూడా అప్లై చేయలేదని నిర్ధా రించింది. పీజీ మెడికల్‌‌ సీట్ల బ్లాకింగ్‌‌ స్కామ్‌‌పై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ గతేడాది ఏప్రిల్‌‌లో వరంగల్ జిల్లా మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసి పీఎమ్‌‌ఎల్‌‌ఏ కింద దర్యాప్తు చేసింది.