171 కాలేజీలు.. లక్షకు పైగా బీటెక్ సీట్లు.. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ

171 కాలేజీలు..  లక్షకు పైగా బీటెక్ సీట్లు.. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ
  • కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు  
  • 21 సర్కార్​ కాలేజీల్లో 5,808 సీట్లు 
  • డీమ్డ్​ వర్సిటీలుగా మారిన రెండు ప్రైవేటు కాలేజీలు
  • అడ్మిషన్లకు ముందుకు రాని మూడు ప్రైవేట్​ కాలేజీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దీంతో ఆయా కాలేజీల్లో సీట్లపై క్లారిటీ కూడా వచ్చింది. సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇందులో కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉన్నాయి. వీటిలో 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

కొత్తగా పాలమూరు, శాతవాహన వర్సిటీల పరిధిలో ఒక్కో కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 148 ప్రైవేటు కాలేజీల్లో 99,610 సీట్లు ఉండగా.. వాటిలో 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో 1800 సీట్లు ఉండగా, ఇందులో కన్వీనర్ కోటాలో 1,260 సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో రెండు ప్రైవేటు కాలేజీలకు డ్రీమ్డ్ వర్సిటీగా మారిపోయాయి. ఎంఎన్​ఆర్, వివేకానంద, సెయింట్ మేరీ ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల కోసం ముందుకు రాలేవు. 

సర్కార్​ కాలేజీల్లో..!

ఓయూ పరిధిలోని రెండు సర్కారు కాలేజీల్లో 630, జేఎన్టీయూహెచ్​ పరిధిలోని 9 సర్కార్​ కాలేజీల్లో 3,210  సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలోని రెండు సర్కార్​ కాలేజీల్లో 780 సీట్లు ఉన్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని ఒక సర్కార్​ కాలేజీలో 240 సీట్లు, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలోని ఒక సర్కార్​ కాలేజీలో 160 సీట్లు, అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని ఒక సర్కార్​ కాలేజీలో 45 సీట్లు, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని ఒక సర్కార్​ కాలేజీలో 23 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

సీఎస్ఈలో 26,150 సీట్లు..

బీటెక్  ఫస్టియర్​లో మొత్తం 47 బ్రాంచుల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. దీంట్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) లో 26,150 సీట్లు కన్వీనర్​ కోటాలో అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో సీఎస్ఈ  (ఏఐఎంఎల్) లో 12,495 సీట్లుండగా.. ఎలక్ట్రానిక్స్  అండ్  కమ్యూనికేషన్  ఇంజినీరింగ్ (ఈసీఈ)లో 10,125 .. సీఎస్ఈ డేటా సైన్స్ లో 6,996..  ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)లో 4,301.. ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ఐటీ)లో 3,681.. సివిల్ ఇంజనీరింగ్ లో 3,129.. మెకానికల్ ఇంజనీరింగ్​లో 2,994 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.  సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 1,439.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో 1,235 సీట్లు ఉన్నాయి. 

ఫస్ట్​ ఫేజ్​లో 10 వరకు వెబ్ ఆప్షన్లు 

టీజీ ఎప్ సెట్–2025 ఫస్ట్  ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. సాయంత్రం నాటికి మొత్తం 95,654 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా.. 7,6494 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు చాన్స్​ ఉంది.