- ఘటనపై విచారణకు ఆదేశించిన ఈసీబీ
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో చిత్తయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ జట్టుపై సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఆసీస్ టూర్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా ఇంగ్లిష్ టీమ్ క్రికెటర్లలో చాలా మంది అతిగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రెండో, మూడో టెస్టుకు మధ్య లభించిన 9 రోజుల విరామంలో క్రికెటర్లు ఏకంగా 6 రోజుల పాటు మద్యం మత్తులో మునిగిపోయారంటూ బీబీసీ వార్తా కథనం ప్రచురించింది. క్వీన్స్‌లాండ్‌లోని నోసా బీచ్ రిసార్ట్‌లో ఆటగాళ్లు కేవలం పార్టీలకే ప్రాధాన్యత ఇచ్చి అతిగా తాగారని తెలిపింది. దాంతో జట్టు అంతా పాల్గొనాల్సిన జిమ్ సెషన్‌కు కేవలం ముగ్గురు ఆటగాళ్లే హాజరయ్యారని పేర్కొంది.
ఈ పరిణామాలపై ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆదేశించాడు. ప్లేయర్లు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదన్నాడు. ఈ వార్తలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెబచ్చరించాడు.
