బంగ్లాపై గట్టెక్కిన ఇంగ్లండ్‌‌.. 4 వికెట్ల తేడాతో గెలుపు.. రాణించిన నైట్‌‌, ఎకిల్‌ ‌స్టోన్‌‌

బంగ్లాపై గట్టెక్కిన ఇంగ్లండ్‌‌.. 4 వికెట్ల తేడాతో గెలుపు.. రాణించిన నైట్‌‌, ఎకిల్‌ ‌స్టోన్‌‌

గువాహటి:  విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో సౌతాఫ్రికాను 69 రన్స్‌‌కే ఆలౌట్ చేసి గ్రాండ్‌‌ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్‌‌ తమ రెండో పోరులో అనామక బంగ్లాదేశ్‌‌ను ఓడించేందుకు చెమటోడ్చింది. చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో తడబడినా మాజీ కెప్టెన్‌ హీథర్ నైట్ (111 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 79 నాటౌట్‌‌) అద్భుత బ్యాటింగ్‌‌తో గట్టెక్కింది. 

మంగళవారం (అక్టోబర్ 07) జరిగిన ఈ  లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇంగ్లిష్ టీమ్‌‌  4వికెట్ల తేడాతో బంగ్లాపై కష్టపడి గెలిచి టోర్నీలో రెండో విజయం సొంతం చేసుకుంది. తొలుత సోఫీ ఎకిల్‌‌స్టోన్‌‌ (3/24)తో పాటు ఇంగ్లండ్‌‌ స్పిన్నర్ల మూకుమ్మడి దాడికి  బంగ్లా 49.4 ఓవర్లలో 178 రన్స్‌‌కే ఆలౌటైంది.  శోభన మోస్తరీ (60)  ఫిఫ్టీతో రాణించగా.. రాబెయా ఖాన్ (27 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 43 నాటౌట్‌‌) చివర్లో సత్తా చాటింది. లిన్సీ స్మిత్ (2/33), చార్లీ డీన్ (2/28), అలీస్ క్యాప్సీ (2/31) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 182/6 స్కోరు చేసి గెలిచింది. నైట్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

శోభన, రాబెయా పోరాటం 

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే తడబడింది. పేసర్ లారెన్ బెల్ వేసిన ఓవర్​లో షర్మిన్ అఖ్తర్ (30)మూడు ఫోర్లతో 14 రన్స్ పిండుకుంది. వెంటనే పుంజుకున్న  బెల్ ఓపెనర్ రుబ్యా హైదర్ (4) వికెట్‌‌ తీసింది. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ నిగర్ సుల్తానా (0) డకౌట్ కావడంతో ఆరు ఓవర్లలోనే బంగ్లాదేశ్ 25/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో శోభన మోస్తరీ ఇన్నింగ్స్‌‌కు వెన్నెముకగా నిలిచింది. షర్మిన్ తో కలిసి మూడో వికెట్‌‌కు 34   రన్స్​ జోడించి ఆటను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 

కానీ, ఎకిల్‌‌స్టోన్‌‌ బౌలింగ్‌‌లో షర్మిన్ కీపర్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ స్పిన్నర్లు.. బంగ్లా బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. తొలి 30 ఓవర్లలో ఏకంగా  138 డాట్ బాల్స్‌‌ (23 ఓవర్లు) వేశారు. ఓ దశలో 61 బాల్స్‌‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఓ ఎండ్‌‌లో శోభన పోరాడుతున్నా తనకు సపోర్ట్ కరువైంది. 

షోర్తా అక్తర్ (23 బాల్స్‌‌లో 10),  రితు మోని (36 బాల్స్‌‌లో 5) రన్స్ చేయలేకపోయారు. ఇక, కీపర్ క్యాచ్ నుంచి ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న శోభన ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకొని  వన్డేల్లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఫహిమా ఖాతున్ (7), నహిదా (1) కూడా ఫెయిలైనా.. తొమ్మిదో నంబర్‌‌‌‌లో వచ్చిన రాబెయా ఖాన్ చివర్లో అనూహ్యంగా విజృంభించింది. చివరి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన ఆమె.. సివర్ -బ్రంట్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 

గెలిపించిన నైట్

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌కు స్టార్టింగ్‌‌లోనే ఎదురు దెబ్బలు తగిలాయి. బంగ్లా పేసర్ మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ ఆరో బాల్‌‌కే ఓపెనర్ ఎమీ జోన్స్ (1)ను ఎల్బీ చేసి బంగ్లాకు బ్రేక్ ఇచ్చింది. ఏడో ఓవర్లో మరో ఓపెనర్ టామీ బ్యూమోంట్ (13)ను కూడా ఎల్బీగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 29/2తో ఇబ్బందుల్లో పడింది. బంగ్లా బౌలింగ్‌‌ పదునుగా ఉండటంతో సీనియర్ ప్లేయర్ హీథర్ నైట్, కెప్టెన్ సివర్ బ్రంట్  జాగ్రత్తగా ఆడారు. ఒక్కో పరుగు రాబడుతూ మూడో వికెట్‌‌కు 40 రన్స్ జోడించారు.  

కానీ, 19వ ఓవర్లో బ్రంట్‌‌తో పాటు సోఫియా డంక్లీ (0)ని పెవిలియన్ చేర్చిన ఫహీమా ఖాటున్‌‌... కాసేపటికే ఎమ్మా లంబ్‌‌ (1)ను కూడా ఔట్‌‌ చేయడంతో ఇంగ్లండ్ 78/5తో ఒక్కసారిగా డిఫెన్స్‌‌లో పడిపోయింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న నైట్.. జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది. అలీస్ క్యాప్సీ (20)తో కలిసి స్కోరు 100 దాటించింది. సంజిదా బౌలింగ్‌‌లో క్యాప్సీ వెనుదిరిగినా.. నైట్ మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయలేదు.  86  బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆమె చార్లీ డీన్ (27 నాటౌట్‌‌) తోడుగా టార్గెట్‌‌ కరిగించింది. ఫహీమా ఖాటున్ మూడు, మరుఫా అక్తర్ రెండు వికెట్లు తీశారు.

సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్‌‌: 49.4 ఓవర్లలో 178 ఆలౌట్‌‌ (శోభన 60, రాబెయా 43 నాటౌట్, ఎకిల్‌‌స్టోన్ 3/24)
ఇంగ్లండ్‌‌:  46.1 ఓవర్లలో 182/6 (హీథర్ నైట్ 79 నాటౌట్‌‌, ఫహీమా ఖాటున్ 3/16)