
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయాన్ని ఖాయం చేసుకునే పనిలో ఉంది. లార్డ్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో మన బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. 40 పరుగులు చేసిన రూట్ టాప్ స్కోరర్ కాగా మిగిలిన వారు విఫలమయ్యారు. ఎలాంటి అద్బుతం జరగకుండా ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. భారత బౌలర్లలో సుందర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, సిరాజ్ రెండు.. ఆకాష్ దీప్, నితీష్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
6 వికెట్లను 175 పరుగులతో నాలుగో రోజు టీ విరామం తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 15 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. సుందర్ స్టోక్స్ ను క్లీన్ బౌల్డ్ చేసి ఏడో వికెట్ అందించాడు. ఆ తర్వాత బుమ్రా ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ పని పట్టాడు. వరుస ఓవర్లలో కార్స్, వోక్స్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ బషీర్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగింపు పలికాడు.
వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే బెన్ డకెట్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో మిడ్ ఆన్ లో షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఊపులో ఒక ఇన్ స్వింగ్ డెలివరీతో పోప్ ను ఎల్బీ డబ్ల్యూ రూపంలో ఔట్ చేశాడు.
క్రాలీ నితీష్ బాల్ కు చిక్కాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను రూట్, బ్రూక్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 37 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆకాష్ దీప్ బ్రూక్ ను బౌల్డ్ చేశాడు. ఈ దశలో 67 పరుగులు జోడించి స్టోక్స్, రూట్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సుందర్ రాకతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. రూట్, స్మిత్, స్టోక్స్ లను సుందర్ బౌల్డ్ చేయడం విశేషం.