న్యూజిలాండ్‌‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

న్యూజిలాండ్‌‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

లండన్: యాషెస్ పరాభవం తర్వాత ఇంగ్లాండ్ జట్టు తన రీసెట్‌‌ను విజయంతో ప్రారంభించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో నాలుగో రోజే న్యూజిలాండ్‌‌ను 115 పరుగుల తేడాతో ఓడించింది. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. లంచ్‌‌కు ముందే 138 పరుగులకే ఆలౌట్ అయింది. 

బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన ఈ పిచ్‌‌పై ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ మైదానంలో అతడికి ఇది నాలుగో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్) మాత్రమే రాణించాడు. మ్యాచ్ మొత్తం కేవలం 166 ఓవర్లలోనే ముగిసిపోయింది. 

ఇంగ్లాండ్ కొత్త ప్రయోగాల్లో భాగంగా జట్టులోకి వచ్చిన ఓపెనర్ ఎమిలియో గే రెండో ఇన్నింగ్స్‌‌లో 57 పరుగులు చేయగా, పునరాగమనం చేసిన బౌలర్ ఒల్లీ రాబిన్సన్ మ్యాచ్‌‌లో మొత్తం 7 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. నాలుగో రోజు డెవాన్ కాన్వే, ఫిలిప్స్ 53 పరుగుల భాగస్వామ్యంతో పోరాడినా ప్రయోజనం లేకపోయింది. 

పిచ్ ఊహించని విధంగా ప్రవర్తించిందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ పేర్కొనగా, పరిస్థితులకు తగినట్లు ఆడి గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. జూన్ 17 నుంచి ది ఓవల్ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.