రోడ్డు నిబంధనలు పాటించేలా చూడండి : మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు నిబంధనలు పాటించేలా చూడండి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • పేరెంట్స్​ నుంచి హామీపత్రం తీసుకోవాలని పిల్లలకు మంత్రి పొన్నం సూచన
  •     ఆర్టీఏ అధికారులు ప్రతి స్కూల్‌‌కు వెళ్లి వాటిని తీసుకోవాలని ఆదేశం
  •     రోడ్డు ప్రమాదం నుంచిఒక్కరిని కాపాడినా జీవితం ధన్యమైనట్లేనని వెల్లడి
  •     రాష్ట్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు షురూ

హైదరాబాద్, వెలుగు: పేరెంట్స్  రోడ్డు నిబంధనలు పాటించేలా పిల్లలు చూడాలని, ఆ మేరకు వారి నుంచి హామీపత్రం తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  సూచించారు. రవాణా శాఖ అధికారులు ఇప్పటి నుంచే తమ పరిధిలోని స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల నుంచి ఆ హామీపత్రాలను స్వీకరించాలని ఆదేశించారు.

గురువారం నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం.. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్రంలో ఏటా 26 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 8 వేల మంది మరణిస్తున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్  స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్, మొబైల్ ఫోన్ మాట్లాడడం అని వెల్లడించారు. 

అందుకే రవాణా శాఖ అధికారులు ప్రతి స్కూల్ కు వెళ్లి విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. ‘‘రోడ్డు ప్రమాదం నుంచి ఒక్క ప్రాణాన్ని కాపాడినా మనిషిగా జీవితం సార్థకత అవుతుంది. ఈ ఏడాది నుంచి ‘సడక్  సురక్షా..జీవన్ సురక్షా’ నినాదంతో ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ ఫోర్స్‌‌మెంట్, ఎమర్జెన్సీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. 

రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత రవాణా శాఖ, ఆర్టీసీకి మాత్రమే పరిమితం కాదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి” అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే ఒక కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని, అందుకే ఆర్టీఏ అధికారులే అన్నీ చేయలేరని, ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి కోరారు. 

ఒక్క ప్రమాదం కూడా చేయని ఆర్టీసీ డ్రైవర్లకు సన్మానం

గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ లో ఒక్క ప్రమాదం కూడా చేయని ఆర్టీసీ డ్రైవర్లను మంత్రి పొన్నం ప్రభాకర్  అభినందించి సన్మానించారు. ఆర్టీసీలో 20 వేల మంది డ్రైవర్లు, 10 వేల బస్సులు ఉన్నాయని, రోజూ 60 లక్షల మంది ప్రయాణికులు 39 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రమాదాలను జీరోకి తగ్గించడమే లక్ష్యంగా డ్రైవర్లు పనిచేయాలని కోరారు. 

రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం స్వయంగా రవాణా అధికారులకు హెల్మెట్  తొడిగారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఈ సందర్భంగా ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, కమిషనర్  ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీలు రమేశ్, చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, పలువురు డీటీసీలు పాల్గొన్నారు.