తల్లి మాటను ఎవరూ కాదనరు..ప్రధాని మోడీ తల్లికి రైతు లేఖ

తల్లి మాటను ఎవరూ కాదనరు..ప్రధాని మోడీ తల్లికి రైతు లేఖ

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న అగ్రి చ‌ట్టాలపై ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ప్ర‌ధాని మోడీ కూడా తగ్గడం లేదు. దీంతో ఆయ‌న తల్లి హిరాబెన్ మోడీకి  పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన  హ‌ర్‌ప్రీత్ సింగ్ అనే రైతు ఓ లేఖ రాశాడు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేలా కుమారుడి మ‌న‌సును మార్చాలంటూ ప్రధాని మోడీ తల్లికి  ఆయ‌న విజ్ఞప్తి చేశాడు. త‌ల్లిగా ఆమె త‌న కుమారుడి మ‌న‌సును మార్చుతార‌ని ఆశిస్తున్నాన‌ని ఆ రైతు లేఖలో తెలిపాడు. ఈ చ‌ట్టాల‌ను ఎందుకు ర‌ద్దు చేయాలో కూడా వివ‌రాలు చెబుతూ ఆ రైతు లేఖ‌లో వివ‌రించాడు.
వ్యవసాయ  చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టికే కొంత‌మంది చ‌నిపోయారని వివ‌రించాడు. కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను అదానీ, అంబానీతో పాటు బ‌డా కార్పొరేట్ల‌కు మేలు చేసేలా రూపొందించారని చెప్పాడు.  త‌ల్లి మాట‌ను ఎవ‌రూ కాద‌న‌రని, అందుకే మోడీ ..త‌ల్లిగా హిరాబెన్ ఆయ‌న‌కు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచ‌న చేయాల‌ని ఆ రైతు విజ్ఞప్తి చేశాడు.