
- ఐదో రోజు పంచామృతాధివాసం
- యాదాద్రిలో వైభవంగా సంప్రోక్షణ
- 29 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయన్న ఈవో
- సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడి
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రిలో మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంప్రోక్షణ పూజల్లో భాగంగా శుక్రవారం ఐదోరోజు బాలాలయంలో అర్చకులు శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనాలతో సుదర్శన యాగం ప్రారంభించారు. ప్రధానాలయంలో ఏకోనపంచాశత్ కలశాభిషేకం, పంచామృతాధివాసం నిర్వహించారు. తర్వాత ప్రధానాలయానికి నలువైపులా నిర్మించిన నాలుగు పంచతల గోపురాలు, సప్తతల, త్రితల, దివ్యవిమాన రాజగోపురాలకు 'ఛాయాధివాసం' నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు 108 మంది రుత్వికులు ప్రధానాలయంలో మూర్తిమంత్ర, మూలమంత్ర జపాలు చేశారు. ఏకోనపంచాశత్ కలశాభిషేకంలో భాగంగా ప్రధానాలయ ముఖ మంటపంలో 49 కలశాలను వరుస క్రమంలో పెట్టి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, గోమూత్రం, సుగంధ ద్రవ్యాలను కలిపి శుద్ధోదకాలను కలశాలలో నింపి వేదమంత్ర పఠనాలతో దేవతామూర్తుల విగ్రహాలకు అభిషేకం చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో శిలామయ, బింబమయ, లోహమయ దేవతామూర్తుల విగ్రహాలకు పంచామృతాధివాసం ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పంచామృతాలను (పాలు, పెరుగు, చక్కెర, తేనే, గోమూత్రం) మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలతో మంత్రవేష్టితం చేసి విగ్రహాలను వేంచేపించారు (నీటిలో ముంచడం). అనంతరం నిత్య లఘు పూర్ణాహుతితో ఐదో రోజు ఉత్సవాలను ముగించారు.
రోజుకు రెండు బ్రేక్ దర్శనాలు..
ఈ నెల 28న ఆలయ ప్రారంభోత్సవం జరగనుండగా 29 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను అందుబాటులోకి తేనున్నట్లు ఈవో గీతారెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 5 వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పారు. దీనికి టికెట్ రేటును ఇంకా నిర్ణయించలేదన్నారు. ప్రారంభోత్సవం తర్వాత ఆలయ టైమింగ్స్ ను కూడా మార్చనున్నట్లు వెల్లడించారు. మబ్బుల 3 గంటలకు ఆలయం ఓపెన్ చేసి, రాత్రి 10 గంటలకు మూసివేస్తామన్నారు. ఉదయం 6:30 నుంచి 8 వరకు, 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి సాయంత్రం 4 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు, రాత్రి 8:15 నుంచి 9:15 వరకు సర్వ దర్శనాలు ఉంటాయని చెప్పారు.