కొమురవెల్లి, వెలుగు: మండలంలోని గురువన్నపేట జడ్పీ స్కూల్లో కొంతమంది ఆకతాయిలు స్కూల్లోని మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్, వైర్, తాగునీటి ట్యాప్ లు, ఇతరత్ర సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ హైమావతి సోమవారం స్కూల్‌ను సందర్శించారు. ప్రిన్సిపాల్, టీచర్లతో కలిసి ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్కూల్లో డ్యామేజ్ అయిన అన్ని వస్తువులకు రిపేర్ చేయిస్తామని తెలిపారు.
ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కాంపౌండ్ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్కూల్‌కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఫర్నిచర్ ఇతరత్ర ఏ వస్తువు కూడా బయట ఉంచకుండా లోపల వేసి తాళం వేయాలని ప్రిన్సిపాల్ కి సూచించారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు చేస్తామని హెచ్చరించారు.
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్
చేర్యాల: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని గుర్జకుంట, వేచరేణి, కడవేర్గు, నాగపురి, ముస్త్యాల, ఆకునూరు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. కలెక్టర్మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.
