గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ చట్టం ప్రకారం యూజీసీ ఈక్విటీ (సమానత్వ) నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్ లోపలి నుంచి ప్రధాన గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. హెచ్సీయూ ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ లెలిన్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన యూజీసీ ఈక్విటీ నిబంధనలు ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను ఎదుర్కొనే దిశగా సానుకూల అడుగు అన్నారు. అయితే, ఈ నిబంధనల్లో వాస్తవ ప్రభావాన్ని తగ్గించారని విమర్శించారు. వివక్ష నిర్వచనాన్ని నీరుగార్చడం, కీలక నిబంధనలను అస్పష్టంగా ఉంచడం వల్ల సారాంశం దెబ్బతిందన్నారు. నాయకులు అశుతోష్, కృపా మారియా జార్జ్, పంకజ్, లీడర్లు పాల్గొన్నారు.
