‘రైతు డిస్కమ్’పై నేడు (మే29) ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ!

‘రైతు డిస్కమ్’పై నేడు (మే29) ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ!
  • హైదరాబాద్​లోని విద్యుత్​ నియంత్రణ భవన్​ వద్ద ఏర్పాట్లు
  • లైసెన్స్​ ఇవ్వకుండా అడ్డుకుంటామంటున్న బీఆర్ఎస్​
  • మీటింగ్​లో పాల్గొంటామని ప్రకటించిన​ కేటీఆర్​  
  • కాంగ్రెస్​ తరఫున హాజరుకానున్న భువనగిరి ఎంపీ చామల, ఎమ్మెల్సీ కోదండరాం 
  • రైతుల పక్షాన వాదనలు వినిపించనున్న కోదండరెడ్డి 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ‘రైతు డిస్కమ్’కు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్​సీ (విద్యుత్ నియంత్రణ మండలి) నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్ నియంత్రణ భవన్‌‌‌‌‌‌‌‌లో కమిషన్ చైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు డిస్కమ్‌‌‌‌‌‌‌‌కు లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటామని బీఆర్​ఎస్ ఇప్పటికే ప్రకటించింది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా వెల్లడించారు. మరోవైపు, కాంగ్రెస్ తరఫున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం హాజరుకానుండగా, రైతుల పక్షాన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని తమ వాదనలు, అభిప్రాయాలను వినిపించనున్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభ్యంతరాలపై చర్చ..

రైతు డిస్కమ్​ను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైతులు, నీటి సరఫరా, ఇతర ముఖ్య రంగాలకు విద్యుత్ సేవలను మెరుగుపరచడం ఈ డిస్కమ్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొన్నది. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, మున్సిపల్ నీటి కనెక్షన్లకు ఈ డిస్కమ్​ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు.

ఈ క్రమంలోనే ఈఆర్​సీ నుంచి లైసెన్స్ పొందడానికి రైతు డిస్కమ్ ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోగా, ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను కోరుతూ ఈఆర్​సీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఈ-మెయిల్, రాతపూర్వకంగా మొత్తం 32 అభ్యంతరాలు వచ్చాయి. నేటి సమావేశంలో రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఎన్​జీవో సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని అధికారులు సూచించారు.