ధరణిలో కనిపిస్తోంది.. రైతుబంధు వస్తోంది అయినా జాగ జాడ చెప్తలేరు!

ధరణిలో కనిపిస్తోంది.. రైతుబంధు వస్తోంది అయినా జాగ జాడ చెప్తలేరు!

 

  • భూమి ఎక్కడుందో చూపాలంటూ పాదయాత్ర
  • ధరణిలో కనిపిస్తోంది..రైతుబంధు వస్తోంది అయినా జాగ జాడ చెప్తలేరు! 
  • 20 గుంటల భూమి కోసం 15 ఏండ్లుగా తిరుగుతున్న బాధితురాలు
  •  పట్టించుకోని రెవెన్యూ అధికారులు 
  • 35 కిలోమీటర్లు నడిచి ఆర్డీవో ఆఫీసులో వినతిపత్రం

షాద్ నగర్ , వెలుగు : ఆమె ఓ దళిత వృద్ధురాలు. 70 ఏండ్ల వయస్సు. అయినా తనకు న్యాయం చేయాలంటూ పాదయాత్ర చేసింది. తనకు 20 గుంటల భూమి ఉందని, కానీ సర్వే నంబర్​లో ఎక్కడుందో తెలియడం లేదని.. చూపించాలని 15 ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోందా బాధితురాలు. కానీ, ఎవ్వరూ ఆమె సమస్యను పరిష్కరించలేదు. ధరణి వచ్చాక పోర్టల్​లో ఆమెకు భూమి వివరాలు కనిపిస్తున్నాయి. పాస్​బుక్​లో కూడా మెన్షన్ ​చేశారు. ఖాతాలో రైతుబంధు కూడా వేస్తున్నారు. కానీ, భూమి ఎక్కడుందని అడిగితే  మాత్రం సమాధానం చెప్పడం లేదు. దీంతో విసిగివేసారిన సదరు మహిళ తన ఊరి నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు సుమారు 35 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చి ఇప్పటికైనా తన భూమిని చూపించాలని వేడుకుంది. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరుకు చెందిన ఎర్ర వెంకటమ్మకు 2008కి ముందు గ్రామంలోని సర్వే నంబర్​ 361/ఇ లో రెండు ఎకరాల భూమి ఉండేది. కొంత భూమి అమ్మడానికి సర్వే చేయించగా ఎకరంన్నర మాత్రమే వచ్చింది. మరో 20 గుంటలు ఎక్కడుందో చెప్పాలని అప్పటి నుంచి  రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉన్న భూమి కూడా పోతుందేమోనని ఎకరంన్నర అమ్ముకుంది. ధరణి వచ్చాక అందులో సదరు సర్వే నంబర్​లో వెంకటమ్మకు 20 గుంటల భూమి ఉన్నట్టు చూపిస్తోంది. పాస్​బుక్​లో కూడా ఇదే పొందుపరిచారు. భూమికి సంబంధించి  రైతుబంధు కూడా వస్తోంది. కానీ భూమి మాత్రం చూపించట్లేదు. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన వెంకటమ్మ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం కాకునూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టింది. వృద్ధురాలు కావడంతో 35 కిలోమీటర్ల దూరంలోని షాద్​నగర్​ ఆర్డీవో ఆఫీసుకు గురువారం చేరుకుంది. ఆర్డీవో ఆఫీసులో వినతిపత్రం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ఈ వయస్సులో తనను కష్టపెట్టడం భావ్యం కాదని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.