మందు కోసం భార్యలను మస్తు బుదగరిస్తున్రు : ఎర్రబెల్లి

మందు కోసం భార్యలను మస్తు బుదగరిస్తున్రు : ఎర్రబెల్లి

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  ఫన్నీ కామెంట్ చేశారు. ఒకప్పుడు ఖర్చుల కోసం మహిళలు భర్త ముందు చేయి జాపాల్సి వచ్చేదని, ఇప్పుడు భర్తలు మందు కోసం భార్యలను బుదగరిస్తున్నరని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల్లో చైతన్యం వచ్చిందని, ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు. 

40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానన్న ఎర్రబెల్లి కేసీఆర్ తెచ్చినటువంటి అద్భుతమైన స్కీంలను ఎవరూ తీసుకురాలేదని చెప్పారు. గతంలో మహిళళు నీటి కోసం అష్టకష్టాలు పడేవారని, ఎక్కడికి వెళ్లినా బోర్లు వేయమని అడిగేవారని చెప్పారు. తన పైసలన్నీ బోర్లకే సరిపోయేవని అన్నారు. కేసీఆర్ దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చాడని, ఇప్పుడు  ఏ మహిళా నీటి కోసం ఇబ్బంది పడటం లేదని ఎర్రబెల్లి గుర్తు చేశారు.