సర్పంచులకు  పైసా బాకీలేం

సర్పంచులకు  పైసా బాకీలేం
  • చేసిన పనులన్నింటికీ డబ్బులిచ్చినం
  • మండలిలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చలో ఎర్రబెల్లి  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచ్‌‌‌‌‌‌లకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం బాకీ లేదని పంచాయతీరాజ్‌‌‌‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు స్పష్టం చేశారు. సర్పంచ్‌‌‌‌లు చేసిన పనులన్నింటికీ డబ్బులు చెల్లించామని ఆయన వెల్లడించారు. శుక్రవారం శాసనమండలిలో పల్లె, పట్టణ ప్రగతిపై షార్ట్ డిస్కషన్‌‌‌‌లో మంత్రి మాట్లాడారు. సర్పంచుల వల్లే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. చేసిన పనులకు నిధులు ఇవ్వట్లేదని ఒకరిద్దరు సర్పంచులు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మంత్రి విమర్శించారు. వాళ్లది రాజకీయ దురుద్దేశమేనని, అందులో నిజం లేదన్నారు. సర్పంచులందరికీ పైసా బాకీ లేకుండా చెల్లించామన్నారు. పంచాయతీ నిధుల్లోంచి పెట్టుబడి కింద డబ్బులు తీసుకునే అధికారాన్ని సర్పంచ్‌‌‌‌లకు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ల ద్వారా ఒక్కో గ్రామపంచాయతీ రూ.10 లక్షలకు తక్కువగాకుండా ఆదాయం సమకూర్చుకుందన్నారు. కొన్ని పంచాయతీలు రూ.20 లక్షల ఆదాయం కూడా పొందాయన్నారు. గతంలో పల్లెలన్నీ కంపుకొట్టేవని, ఇప్పుడు హరితహారం, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, మిషన్ భగీరథ నీళ్లతో ఊర్ల రూపురేఖలు మారాయన్నారు. కేంద్రం నుంచి అవార్డులే తప్ప పైసా రావట్లేదని ఎర్రబెల్లి ఆరోపించారు. పల్లెలు, పట్టణాలను జోడు ఎద్దుల తీరుగా సమానంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రోడ్లు, డ్రింకింగ్ వాటర్, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.