బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గెలిస్తేనే అభివృద్ధి, సంక్షేమం : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గెలిస్తేనే అభివృద్ధి, సంక్షేమం : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

తొర్రూరు, వెలుగు :  రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు చెప్పారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు డప్పుచప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం దయాకర్‌‌‌‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ చొరవతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు.

ఐదేళ్లలో నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించానని, ఆలయాల అభివృద్ధితో పాటు దళితబంధు, రైతు బంధు, ఆసరా పింఛన్లు మంజూరు చేశామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌లో కరెంటే సరిగా ఉండేది కాదని, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లల్లోనే 24 గంటల కరెంట్, ఇంటింటికీ మిషన్‌‌‌‌ భగీరథ నీళ్లు ఇవ్వడంతో పాటు అనేక చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లు, భారీ ప్రాజెక్ట్‌‌‌‌లు నిర్మించామన్నారు.

ఎన్నికలు రాగానే కొందరు ఊళ్ల మీద పడి, అధికారం కోసం అడ్డూ, అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మితే నట్టేట మునిగినట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పాలిత రాష్ట్రాల్లో అమలుకు సాధ్యం కాని పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో మళ్లీ గెలిచేది కారేనని, కేసీఆర్‌‌‌‌ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌‌‌‌ను ఆదరించాలన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ సుధాకర్‌‌‌‌రావు, ఉషా దయాకర్‌‌‌‌రావు, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, కిశోర్‌‌‌‌రెడ్డి, డాక్టర్‌‌‌‌ సోమేశ్వర్‌‌‌‌రావు, వీఎస్‌‌‌‌కే గౌడ్‌‌‌‌, దేవేందర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.