హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం (డిసెంబర్ 5) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ పల్లెలకు మంచిరోజులు వస్తాయని.. అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని సూచించారు. మా పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాయని చెప్పారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దని.. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. కష్టాలకు వెరవద్దని ధైర్యం చెప్పారు. ప్రణాళికలు వేసుకొని పల్లెలు బాగుచేసుకుందామన్నారు.
