నలభై దాటిన ప్రతీ కార్మికుడికీ ఏటా ఫ్రీ హెల్త్ చెకప్ : ఈఎస్ఐసీ

నలభై దాటిన ప్రతీ కార్మికుడికీ ఏటా ఫ్రీ హెల్త్ చెకప్ : ఈఎస్ఐసీ
  •     సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈఎస్ఐసీ
  •     కోటి మందికి పైగా కార్మికులకు లబ్ది చేకూరుతుందన్న కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ

న్యూఢిల్లీ: కార్మికులు, ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు అందించే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈఎస్ఐసీ సభ్యుల్లో 40 ఏండ్లు పైబడిన ప్రతీ కార్మికుడు, ఉద్యోగికి ఏటా ‘ఉచిత హెల్త్ చెకప్’ నిర్వహించనుంది. మంగళవారం ప్రారంభించిన ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు ఒక కోటి మందికి పైగా కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. 

గత ఏడాది నవంబర్‌లో నోటిఫై చేసిన కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. 40 ఏళ్లు దాటిన కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం యజమాన్యాలకు తప్పనిసరి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈఎస్ఐసీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈఎస్ఐసీ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (ప్లాటినం జూబ్లీ) ఈ పథకాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. 

ఈఎస్ఐసీ ఆసుపత్రుల ప్రమాణాలను ‘‘ఎయిమ్స్’’ స్థాయికి పెంచాలని, మందులు, పరికరాలు మరియు వైద్యుల కొరత లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనవసరమైన రెఫరల్స్ (వేరే ఆసుపత్రులకు పంపడం) తగ్గించి, ఇన్-హౌస్ వైద్య సేవలను బలోపేతం చేయాలని సూచించారు.