ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే..

ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే..
  • రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి
  • టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం

నిర్మల్/ నర్సాపూర్ (జి)/దిలావర్​పూర్​, వెలుగు :  రైతుల పంట పొలాల అస్తిత్వానికి ముప్పు తెచ్చే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రస్తుతమున్న చోటు నుంచి ఎత్తేయాల్సిందేనని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ ​చేశారు. గురువారం నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని కోదండరాం పరిశీలించారు. దీనికి ముందు లింగోజి చెరువులో ఉపాధి పనులను చేస్తున్న కూలీలు, రైతులతో ఆయన ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, రైతులు కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. 

కోదండరాం మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు పొంచి ఉంటుందన్నారు. ఫ్యాక్టరీ తొలగింపు కోసం ఆందోళనలు చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు కేసులు నమోదు చేయడం కరెక్ట్​ కాదన్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ నిర్మించడం సరికాదని, ఫ్యాక్టరీ పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అప్పటి పాలకుల ఒత్తిడి మేరకే పోలీసులు రైతులపై కేసులు నమోదు చేశారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  ఎంపీపీ పాల్దె అక్షర అనిల్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సాగర్ రెడ్డి, అరుగుల రమణ, కుంట గంగారెడ్డి, సప్పల రవి, కోడె శ్రీనివాస్,  కోడె నవీన్, బెల్లాజి రాజు, కోడె విజయ్ పాల్గొన్నారు.