హైదరాబాద్, వెలుగు: పారదర్శకత, జవాబుదారీతనమే ప్రజాప్రతినిధుల్లో నైతిక విలువలకు కొలమానమని శాసన మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ మహేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం కౌన్సిల్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన శాసన మండలి ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారని, రాజకీయాల్లో సద్విమర్శ అవసరమే కాని, హద్దులు దాటవద్దని అన్నారు.
దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ శాసన వ్యవస్థను నిలిపేందుకు ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నైతిక విలువలపై పూర్తి స్థాయిలో సభ్యులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే రాజ్యసభను, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను ఎథిక్స్ కమిటీ సందర్శించనుందని మహేశ్ గౌడ్ చెప్పారు. కాగా.. రూల్స్ కమిటీ సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట సభల గౌరవాన్ని కాపాడడంలో సభా నియమాలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంలో రూల్స్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
భవిష్యత్‌లో ఎస్టీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు
రానున్న రోజుల్లో ఎస్టీలకు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీలో లంబాడీలకు, ఆదివాసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ అధ్యక్షతన మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆదివాసీలు, లంబాడీలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
