- జర్మనీ అడవుల్లో కార్చిచ్చు.. పేలుతున్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు
- ఉపశమనం కోసం ప్రజలపై వాటర్ కేనన్లతో నీళ్లు చల్లిన బెర్లిన్ పోలీసులు
- విపరీతంగా పెరిగిన టెంపరేచర్లు ఫ్రాన్స్‌లో మూడు రోజుల్లో వెయ్యి మంది మృతి
పారిస్/బెర్లిన్: యూరప్‌ను హీట్‌వేవ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వైల్డ్ ఫైర్స్, రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండదెబ్బకు ఫ్రాన్స్‌లో వెయ్యి అదనపు మరణాలు నమోదైనట్లు అంచనా. జర్మనీలోని అడవుల్లో మంటలు చెలరేగడంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు పేలుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవిస్తున్నాయి. ఈ నెల20న ప్రారంభమైన ఈ హీట్‌వేవ్స్ యూరప్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనవని సైంటిస్ట్‌లు తెలిపారు.
వృద్ధులే ఎక్కువ
ఫ్రాన్స్‌లో సాధారణంగా రోజుకు 900 నుంచి వెయ్యి వరకు నమోదయ్యే మరణాల సంఖ్య బుధవారం 1,200 దాటగా, గురు, శుక్రవారాల్లో రోజుకు 1,400కు చేరింది. ఈ లెక్కన మూడు రోజుల్లోనే కనీసం వెయ్యి అదనపు మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ప్రజారోగ్య సంస్థ అంచనా వేసింది. వారిలో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని తెలిపింది. మరోవైపు ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో 63 వేలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ వర్షాలు దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించలేకపోయాయి.
జర్మనీలో తగ్గని ఎండలు
జర్మనీ సాక్సోనీ రాష్ట్రంలోని కుబ్‌షుట్జ్‌లో రాత్రిపూట కూడా టెంపరేచర్లు 29.4 డిగ్రీల కంటే తగ్గలేదు. జర్మనీ చరిత్రలో రాత్రి వేళల్లో ఇంతలా ఉష్ణోగ్రతలు రికార్డ్ కావడం ఇదే మొదటిసారి. మరోవైపు మోకెర్న్–డ్రేవిట్జ్ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. గోహ్రిష్‌హైడే, ట్రైసెన్ ప్రాంతాల్లోని అడవుల్లో కార్చిచ్చు (వైల్డ్ ఫైర్స్) రగులుకుంది.
అయితే, ఈ అడవుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబులు (మందుగుండు సామాగ్రి) భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. మంటల వేడికి అవి పేలడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. బాంబు స్క్వాడ్‌ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోవైపు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో శనివారం ఒక్క రోజే వందలాదిమంది ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో అంబులెన్స్‌ల కోసం అదనంగా 500మంది కాల్స్ చేసినట్టు తెలిసింది. బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద ఎండ తీవ్రతకు స్థానికులు, పర్యాటకులు తట్టుకోలేక అల్లాడిపోయారు.
ఉపశమనం కోసం సాధారణంగా పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టడానికి ఉపయోగించే భారీ వాటర్ కానన్లతో చల్లటి నీటిని వారిపై చిలకరించారు. ఎండ వల్ల రహదారుల కాంక్రీట్ పగిలిపోతుండడం, పలు చోట్ల రైల్వే పట్టాలు వ్యాకోచించడంతో జర్మనీ రైల్వే సంస్థ అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. లైప్‌జిగ్ నగరంలో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
నదుల్లో తగ్గిన నీరు
ఎండల ప్రభావం ఇటలీ, పోలాండ్ దేశాలపై కూడా పడింది. రహదారులు పగిలిపోవడం, ట్రైన్ సర్వీసులకు అంతరాయాలతోపాటు విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. డాన్యూబ్, పో వంటి నదుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో పాటు నీరు వేడెక్కింది. దీంతో వ్యవసాయం, అణు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇటలీలోని పో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సముద్రపు ఉప్పునీరు 18 కిలోమీటర్ల మేర లోనికి చొచ్చుకొచ్చింది. దీంతో నది డెల్టాలోని చిత్తడి నేలలకు ముప్పు వాటిల్లనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
గ్రీస్, డెన్మార్క్‌లలోనూ అదే పరిస్థితి
గ్రీస్‌లో కొండ ప్రాంతాలు, జనావాసాలున్న ద్వీపాలు వందకు పైగా ఉండడంతో మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. అందుకే శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. డెన్మార్క్‌లో శనివారం రికార్డు స్థాయి ఎండలు దంచికొట్టగా, ఆదివారం ఉదయానికి వాతావరణం మారి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను సంభవించింది. కొన్ని గంటల్లోనే 1,156 సార్లు ఆకాశం మెరిసినట్టు సమాచారం.
