- రోజుకు ఆరు వేల వెహికల్స్ సేల్
- వార్షికంగా రిజిస్ట్రేషన్లు 64 శాతం జంప్
న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ (ఈ2డబ్ల్యూ) పరిశ్రమ శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ నెలలో రోజుకు ఆరు వేల బండ్లకు పైగా రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పెట్రోల్ఖర్చులు పెరగడం, ఈ–టూవీలర్ల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, చార్జింగ్ స్టేషన్ల విస్తరణ ఈ విభాగం వృద్ధికి దోహదపడ్డాయి. వాహన్ వెబ్సైట్ డేటా ప్రకారం జూన్ నెలలో ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు వార్షికంగా 64 శాతం పెరిగి 1,81,168 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జూన్ నెలలో రోజుకు సగటున 3,600 రిజిస్ట్రేషన్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో నమోదైన 1,92,508 యూనిట్ల తర్వాత, జూన్ నెల అత్యధిక అమ్మకాలు సాధించిన రెండో నెలగా నిలిచింది. పశ్చిమ ఆసియా దేశాల్లో ఘర్షణల కారణంగా వాహన ధరలు పెరుగుతాయన్న అంచనాతో మార్చిలోనే చాలా మంది ముందస్తుగా బండ్లను కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంధన ధరలు లీటరుకు రూ.ఏడు పెరగడం వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్‌లో 1.39 లక్షల యూనిట్లు, మే నెలలో 1.73 లక్షల యూనిట్లు, జూన్ నెలలో 1.81 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
మార్కెట్ లీడర్ టీవీఎస్
టీవీఎస్ మోటార్ ఈనెల 44,474 యూనిట్ల అమ్మకాలతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ వాటా 25 శాతం వద్ద స్థిరంగా ఉంది. టీవీఎస్ చైర్మన్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ ఇంధన ధరల అనిశ్చితి వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కంపెనీ ఐక్యూబ్, టీవీఎస్ ఎక్స్, ఆర్బిటర్ మోడళ్లను విక్రయిస్తోంది. బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వరుసగా 40,576, 29,422 యూనిట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. హీరో మోటోకార్ప్ 155 శాతం వృద్ధితో 20,218 వాహనాలను అమ్మింది. ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్లు మాత్రం 27 శాతం తగ్గి 15,096 యూనిట్లకు చేరాయి. ఓలా మార్కెట్ వాటా గత ఏడాది 18 శాతం నుంచి 8 శాతానికి పడిపోయింది. ఢిల్లీ వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలు కంపెనీలకు మేలు చేస్తున్నాయి. ఢిల్లీలో కొనుగోలుదారులకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తోంది.
టాటా సియెర్రా ఈవీ..ఒక్క చార్జ్‌తో 665 కి.మీ
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెరా ఈవీ'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 18.79 లక్షల నుంచి రూ. 24.79 లక్షల వరకు ఉన్నాయి. ఇది 63, 75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 665 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. 12.3 -అంగుళాల స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 540 డిగ్రీ కెమెరా, 6 టెర్రైన్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వచ్చే నెల 15 నుంచి డెలివరీలు ఇస్తారు
