6 నెలలైనా ఉద్యోగాల భర్తీ ఊసే లేదు

6 నెలలైనా ఉద్యోగాల భర్తీ ఊసే లేదు

ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆరు నెలలైనా ఇంకా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కమిటీల పేరుతో కాలయాపన చేసిన సర్కారు.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు లక్షా 91 వేల ఖాళీలను కాస్తా 80వేలు మాత్రమే అని లెక్క తేల్చారని మండిపడ్డారు. 

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దం ఆడారని షర్మిల ఆరోపించారు. ఆ మాట చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయని హడావుడి చేయడం తప్ప చేసిందేం లేదని విమర్శించారు. అందుకే యువత సీఎం కేసీఆర్ ను నమ్మడం లేదని మరోసారి మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా త్వరలో నోటిఫికేషన్లంటూ దొంగ హామీలు ఇవ్వడం మినహా కేసీఆర్ చేసిందేం లేదని చెప్పారు. నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని షర్మిల స్పష్టం చేశారు.