వెయ్యి మంది కేసీఆర్‌లొచ్చినా మోడీని అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి

వెయ్యి మంది కేసీఆర్‌లొచ్చినా మోడీని అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి

తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్దమేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు మీ జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు. మాట తప్పం.. మడమ తిప్పం అని సవాల్ చేశారు. ఆడబిడ్డ అని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసుల ముందు టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఉందని ఆరోపించారు. అసలు ఈ తెలంగాణలో శాంతి, భద్రతలున్నాయా.. ఈ పోలీసులు శాంతి, భద్రతల కోసం ఉన్నారా..  ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా అని నిలదీశారు. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసీఆర్ తెలంగాణను ఎటు తీసుకపోతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, మద్యం తెలంగాణాగా మార్చేశారని ఆరోపించారు. ఈ మధ్య తాను మునుగోడులోని ఓ గ్రామానికి వెళ్లినపుడు.. అక్కడ ఎన్ని మద్యం షాపులున్నాయని అడిగితే.. 50మందికి ఒకటి చొప్పున, ముప్పై మందికి ఒకటి బెల్టు షాపులున్నాయని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సాధించిన ఘనత ఇది అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు ప్రధాని మీద, గవర్నర్ మీద, ఉద్యమాల మీద గౌరవముండదని ఆరోపించారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్ల లాగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న పార్టీలను పోలీసులు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 

తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదని తేల్చి చెప్పారు. మోడీ వస్తే ఫామ్ హౌస్ లో దాక్కునే కేసీఆర్.. ప్రధానిని గద్దె దించుతాడనడం హాస్యాస్పదమన్నారు. వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసిలు వచ్చినా, వెయ్యి బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా 3వ సారీ ప్రధాని మోడీనే అవుతారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం భరతం పట్టి, అక్రమాస్తులను పేదలకు పంచి పెడుతామని స్పష్టం చేశారు. దళితబంధు ఈటెల రాజేందర్ వల్లే వచ్చిందని, లబ్ధిదారులు ఈటల, మోడీ ఫొటోలు పెట్టుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ పేరుతో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి... సంగ్రామ యాత్రకు ప్రజలు దీవించి అండగా ఉండాలని కోరారు.