కోర్టు వద్దన్నా.. శ్మశానవాటిక కడుతున్నరు

కోర్టు వద్దన్నా.. శ్మశానవాటిక కడుతున్నరు

తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట రైతు కుటుంబం ధర్నా

రాజాపేట, వెలుగు: తమ స్థలంలో శ్మశానవాటిక కట్టొద్దంటూ కోర్టు ఆర్డర్​ ఇచ్చినా పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ రైతు కుటుంబ సభ్యులు తహసీల్దార్ ఆఫీస్​ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బసంతపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి లక్ష్మి, నరసయ్య దంపతులకు 137/బి సర్వే నంబర్​లో 9.03 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఇక్కడ ఆఫీసర్లు శ్మశాన వాటిక నిర్మాణ పనులు ప్రారంభించారు. నరసయ్య పలుమార్లు ఆఫీసర్లకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో సర్పంచ్​ వెంకట్​రెడ్డి సహా తొమ్మిది మందికి ఆలేరు కోర్టు నోటీసులు జారీ చేసింది. రైతు జాగాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ మండల స్థాయి ఆఫీసర్లకు ఆర్డర్స్​ ఇచ్చింది. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. పనులను అడ్డుకోబోయిన తమపై సర్పంచ్​ దౌర్జన్యానికి దిగారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ​ఎదుట ధర్నా చేశారు. కోర్టు ఆర్డర్​ అమలయ్యేలా చూడాలని ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశారు. ఆఫీస్ ​ఆవరణలో సర్పంచ్​ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో పోరంబోకు, ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ తమ భూమిలోనే శ్మశానవాటిక నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు.