
హైదరాబాద్, వెలుగు: మన దేశ పౌరసత్వం పొందిన తర్వాత పాత జర్మనీ పాస్‌పోర్టుతో ప్రయాణం చేస్తే ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు కాదని వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తరఫు లాయర్ రామారావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వంగా జర్మనీ ఎంబసీ కూడా చెప్పిందని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెన్నమనేని 2009లో భారత పౌరసత్వం పొందారంటూ రమేశ్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ఫిర్యాదును కేంద్ర హోం శాఖ పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమన్నారు.
చెన్నమనేని పౌరసత్వ వివాదంపై దాఖలైన కేసును మంగళవారం జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. రామారావు వాదనలు వినిపిస్తూ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని, వేములవాడలో ఆయనపై పోటీ చేసి ఓడిన ఆది శ్రీనివాస్ 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలన్న నిబంధనల్ని గాలికి వదిలేసి 120 రోజుల తర్వాత చేశారన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత 120 రోజులకు అభ్యంతరం చెప్పడం చెప్పడం, దీనిని కేంద్ర హోం శాఖ స్వీకరించడం చెల్లదన్నారు. విచారణ బుధవారం కొనసాగుతుంది.