నెహ్రూ, ఇందిర కూడా రాష్ట్రాల పేర్లు చెప్పలే

నెహ్రూ, ఇందిర కూడా రాష్ట్రాల పేర్లు చెప్పలే
  • కేంద్ర బడ్జెట్ పై చర్చలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • కేంద్రం మద్దుతుతోనే తెలంగాణ నడుస్తున్నదని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధానులు జవహర్ లాల్  నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినపుడు ఏ రాష్ట్రాల పేర్లనూ ప్రస్తావించలేదని బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు బడ్జెట్ విషయంలో ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 

మహిళలు, రైతులు, చిన్నపిల్లల ప్రస్తావన బడ్జెట్ లో లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అలా చూస్తే... నెహ్రూ కూడా పిల్లల ప్రస్తావన తేలేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్  నేతలు గందరగోళంలో పడ్డారని విమర్శించారు. యూపీఏ  హయాంలో తెలంగాణలో రైల్వే స్టేషన్ల వైట్ వాష్  కోసం కేవలం రూ.5 కోట్లే కేటాయించారని గుర్తుచేశారు. బీజేపీ సర్కారు మాత్రం రూ. 31 వేల కోట్లు కేటాయించిందన్నారు. 

ఒక్క సికింద్రాబాద్  రైల్వే స్టేషన్  అభివృద్ధికే రూ.700 కోట్లు ఇచ్చామని, అలాగే జాతీయ రహదారులకు రూ.లక్ష కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దుతుతోనే తెలంగాణ నడుస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎం కాకుండా కేంద్రం ఇచ్చిన రూ.9 వేల కోట్లతోనే రాష్ట్రంలో విద్యుత్, నల్లా నీళ్లు, ఆర్టీసీ డీజిల్  వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఆదాయం రూ.1. 35 లక్షల కోట్లు అని, ఇందులో రూ.55 వేల కోట్లు జీతాలు, రూ. 80 వేల కోట్లు లోన్లకే పోతున్నదన్నారు. రాష్ట్ర ఖజానాలో ఏమీ మిగలడం లేదని, దీనికి గత బీఆర్ఎస్  సర్కారే కారణమని కొండా ఫైర్  అయ్యారు.