దళితబంధు పథకం కేవలం ఎన్నికల వరకే

దళితబంధు పథకం కేవలం ఎన్నికల వరకే
  • రాష్ట్రంలో 4లక్షల 80 వేల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్
  • భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా : దళితబంధు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అసలు ఈ పథకాన్ని కొనసాగించలేరని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దళితబంధు పథకానికి అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని చెప్పారు. బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంతో పాటు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ ను ఆదానిబాద్గా చేసుకో అంటున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో చేస్తుంది అదేకదా అని ప్రశ్నించారు. ఒరిస్సాలోని నైని కోల్ మైన్ ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి అప్పగిస్తే 20 వేల కోట్లు ఉన్న కాంట్రాక్టు 60 వేల కోట్లకు పెంచింది కేసీఆర్, కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. 

రాష్ట్రపతి అభ్యర్థి హైదరాబాద్ వస్తే 50 కోట్ల ప్రజాధనంతో హోర్డింగులు

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే ప్రభుత్వ ధనం 50 కోట్ల రూపాయల ఖర్చు చేసి హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం రాలేదు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు, నీవు తొమ్మిదేళ్లలో ఊరికి 9 ఇళ్లు అయినా కట్టావా ?  అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 లక్షల 80 వేల పెన్షన్ల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని ఆయన చెప్పారు.