షిప్పు కదిలింది.. రాకపోకలు మొదలైనయ్​

షిప్పు కదిలింది.. రాకపోకలు మొదలైనయ్​

సూయజ్ (ఈజిప్ట్): సూయజ్ కాల్వలో ఇరుక్కున్న ఎవర్ గ్రీన్ షిప్పు ఎట్టకేలకు కదిలింది. దీంతో కొన్ని రోజులుగా ఈ మార్గంలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. సూయజ్ కెనాల్ అధికారులు.. ఒడ్డులో బంక మట్టిని తొలగించి, షిప్పు చుట్టూ 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి, పుల్ అండ్ పుష్ విధానంలో 10 టగ్ బోట్ల సాయంతో షిప్పును కదిలించారు. కాల్వ మధ్యభాగంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు. టగ్ బోట్లు చుట్టు ముట్టిన షిప్పు కాల్వ మధ్యభాగంలో మెల్లగా కదులుతున్న వీడియో లోకల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆ నౌక.. 1.5 నాట్స్ వేగంతో కదులుతున్నట్టు అధికారులు చెప్పారు. 'సూయజ్ కెనాల్ లో చిక్కుకున్న ఎవర్ గ్రీన్ షిప్పును సక్సెస్ ఫుల్​గా ముందుకు కదిలించాం. కెనాల్​లో మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి' అని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ అడ్మిరల్ ఒసామా రబీ ప్రకటించారు. 400 మీటర్ల పొడవైన ఎవర్ గ్రీన్ షిప్పు గత మంగళవారం సూయజ్ కాల్వలో ఇరుక్కుపోయింది. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గొర్రెలతోపాటు చమురు, ఎల్పీజీ ఇతర సరకులను తరలిస్తున్న సుమారు 369 నౌకలు అక్కడే నిలిచిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో రోజుకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈజిప్టు వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.
అన్ని నౌకలు కదిలేందుకు మరో మూడ్రోజులు..
‘ఎవర్ గ్రీన్ షిప్పును సక్సెస్ ఫుల్ గా కదిలించాం. ఇక ఒక్క సెకన్ కూడా వేస్ట్ చేయబోం, వెంటనే ట్రాఫిక్ ను క్లియర్ చేస్తాం’ అని ఒసామా రబీ చెప్పారు. పూర్తి స్థాయిలో నౌకలు కదిలేందుకు మరో మూడు రోజులు పడుతుందన్నారు. రోజూ సూయజ్ కెనాల్ మీదుగా వంద షిప్పులు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. సూయజ్ కెనాల్ లో క్రైసిస్ ముగిసిందని, షిప్పును తొలగించడంలో సక్సెస్ అయ్యామని ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ అల్సిసి ప్రకటించారు. నౌకల రాకపోకలు తిరిగి స్టార్ట్ అయ్యాయని తెలిపారు. 10 శాతం ప్రపంచ వాణిజ్యం సూయజ్ కెనాల్ మీదుగానే జరుగుతుంది. చమురు నుంచి అనేక సరుకులు ఈ మార్గం గుండా రవాణా అవుతుంటాయి.  కిందటేడాది ఈ కెనాల్ మీదుగా 19 వేల షిప్పులు ప్రయాణించాయి.