మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ నెరవేరుస్తం: భట్టి

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ నెరవేరుస్తం:  భట్టి

హైదరాబాద్, వెలుగు: వచ్చే బడ్జెట్‌‌లో బీసీలు, కుల వృత్తుల వారికి రూ.20 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌‌ పెడ తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రజా భవన్‌‌లో గౌడ సంఘాల నాయకులు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ సామాజిక వర్గం, కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. 

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి చేయూత ఇవ్వాలని వారు కోరారు. వృత్తిలో భాగంగా మరణించిన వారి కుటుంబాలకు, చెట్టుపై నుంచి పడి వైకల్యం పొందిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌‌గ్రేషియా రెండేండ్లుగా పెండింగ్‌‌లో ఉందని చెప్పారు. అలాంటి వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా, బడ్జెట్‌‌లో బీసీలు, కులవృత్తుల వాళ్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని మంత్రి భట్టి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని, తాము పాలకులం కాదు.. సేవకులమని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్​ బాలగోని బాల్ రాజ్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.