
- సీఎం రేవంత్ రెడ్డి పక్కా కార్యాచరణతో పథకాలు అమలు చేస్తున్నరు
- బీఆర్ఎస్ ప్రభుత్వంఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని ఆరోపణ
- పెద్దవాగుపై కల్వర్టుల నిర్మాణానికి కృషి చేస్తానని వెల్లడి
- జైపూర్, మందమర్రి మండలాల్లో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పక్కా కార్యాచరణతో అన్ని సమస్యలను తీర్చడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్, మందమర్రి మండలాల్లోని గ్రామాల్లో ఆయన పర్యటించి, మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని, రూ.2 లక్షల రుణమాఫీని త్వరలోనే పూర్తి చేయబోతున్నామని చెప్పారు. మందమర్రి మండలం అందుగులపేట, పులిమడుగు శివారులోని రాళ్లవాగు(పెద్దవాగు)పై కల్వర్టుల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ గ్రామాలు ఒకవైపు, పొలాలు మరోవైపు ఉండగా.. మధ్యలో రాళ్లవాగుపై కల్వర్టులు లేక వర్షాకాలం వాగు దాటి వెళ్లలేకపోతున్నామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి వాగుపై కల్వర్టులను మంజూరు చేయాలని కోరుతానని హామీ ఇచ్చారు.
బైక్‌పై గ్రామాల్లో పర్యటన..
జైపూర్, టేకుమట్ల, ఇందారం, రామారావుపేట, మందమర్రి మండలాల్లోని అందుగులపేట, పులిమడుగు, ఊరు రామకృష్ణాపూర్‌లో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బైక్‌పై వెళ్లి ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామం నుంచి గోదావరి నదికి వెళ్లే రోడ్డు నిర్మాణంతో పాటు చెన్నకేశవ ఆలయం అభివృద్ధికి నిధులివ్వాలని టేకుమట్ల గ్రామస్తులు కోరగా, గోదావరి వరదల్లో మునుగుతున్న తమ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని శివ్వారం గ్రామ రైతులు వినతి పత్రాలు అందజేశారు.
ఇందారంలో కొందరు అక్రమార్కులు తాముంటున్న ఇండ్లు, వాటి పక్కనున్న స్థలాలను అక్రమంగా పట్టాలు చేసుకున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు. అలాగే, రామారావుపేటలో మహిళ భవన్‌కు రోడ్డు నిర్మించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యులు వినతిపత్రం అందించారు. మరోవైపు ‘స్వచ్ఛదనం.. పచ్చదనం’కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఆఫీసులు, స్కూల్స్ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ..
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరురామకృష్ణాపూర్‌లో వివిధ కారణాలతో మృతి చెందిన చిలువేరి నారాయణ, ఇజ్జగిరి చెంద్రయ్య, గోపతి లింగయ్య కుటుంబాలను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఇందారం గ్రామంలో మృతి చెందిన పాగాల తిరుపతి కుటుంబంతో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ లీడర్ గాడిపల్లి రాజయ్యను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.