4 లక్షలకు పైగా మరణాలతో యూపీనే టాప్
ఈ మధ్య కాలాలు కట్టు తప్పాయి. వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి. విపరీతమైన చలి. ఎండాకాలమొస్తే ఒళ్లు మంటెక్కిపోయే వేడి. అన్నింటికీ కారణం ఒకటే, వాతావరణంలో మార్పులు. దాని వెనక ఉన్నది కాలుష్యం. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ (కార్బన్ డయాక్సైడ్)తో పరిస్థితి నానాటికీ చేయి దాటిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎండ వేడి ధాటికి మన దేశంలో 2100 నాటికి ఏటా 15 లక్షల మంది బలైపోవాల్సి వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ (టీఎస్డీ) స్టడీలో ఈ విషయం తేలింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇండియా వార్షిక సగటు టెంపరేచర్లు 4 డిగ్రీలు పెరుగుతాయని స్టడీ హెచ్చరించింది. ప్రస్తుతం 24 డిగ్రీలుగా ఉన్న సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు పెరుగుతాయని చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వేడి రోజులు 67కు పెరుగుతాయని, సగటు టెంపరేచర్లు 35 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. 2010లో వేడి రోజులు మూడు మాత్రమేనని పేర్కొంది.
పంజాబ్ గరం గరం
2100 నాటికి దేశంలో అత్యంత వేడిగా ఉండే రాష్ట్రం పంజాబేనని స్టడీ వివరించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర సగటు టెంపరేచర్ 32 డిగ్రీలు కాగా, 2100 నాటికి 36 డిగ్రీలకు పెరుగుతుందని తెలిపింది. అత్యధికంగా 85 రోజులు వేడి రోజులుంటాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాల్లో (కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి) 16 రాష్ట్రాలు గరం గరంగా ఉంటాయని స్టడీ హెచ్చరించింది. అయితే, వేడి రోజులు ఎక్కువగా పెరిగే రేటులో ఒడిశానే ముందుంటుందని చెప్పింది. 2010లో 1.62 రోజులుగా ఉన్న అత్యంత వేడి దినాలు, శతాబ్దం చివరి నాటికి 48కి (29 రెట్లు) పెరుగుతాయని హెచ్చరించింది. ఎండాకాలం టెంపరేచర్ల పెరుగుదలలో హిమాలయ రాష్ట్రాలు ముందుంటాయని వివరించింది.
యూపీలోనే వేడి మరణాలు ఎక్కువ
వేడి వల్ల ఎక్కువగా చనిపోయే వారి సంఖ్య యూపీలోనే ఎక్కువగా ఉంటుందని టీఎస్డీ స్టడీలో తేలింది. ఏటా 4 లక్షల 2 వేల 280 మంది వేడికి బలైపోతారని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లక్ష మంది చొప్పున చనిపోతారని తెలిపింది. ఈ ఆరు రాష్ట్రాల్లో వేడికి 64 శాతం మరణాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2040 నాటికి ఇండియాలో కాలుష్యం స్థాయులు రెట్టింపు అవుతాయని, ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్య కారక దేశంగా ఇండియా నిలుస్తుందని చెప్పింది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పోటీ విపరీతంగా ఉందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ జీవన విధానాన్ని వదులుకోవట్లేదని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అభివృద్ధిని వదులుకోవాలనుకోవట్లేదని అన్నారు.

