ఫైర్ సేఫ్టీ జాన్తా నై

ఫైర్ సేఫ్టీ జాన్తా నై
  • ఫైర్ సేఫ్టీ జాన్తా నై
  • గ్రేటర్  హైదరాబాద్​లో  70 వేల ట్రేడ్ లైసెన్స్ లు
  • ఫైర్  సేఫ్టీ కోసం 500 మందే దరఖాస్తు
  • వారిలో వంద మంది వద్దే  భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ఫైర్ ​సేఫ్టీ విషయంలో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యంగా ఉన్నారు. గ్రేటర్​హైదరాబాద్​లో 70 వేల ట్రేడ్ లైసెన్స్​లు ఉండగా ఫైర్ సేఫ్టీ మాత్రం వంద మంది మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే సిటీలో రోజుకోచోట అగ్నిప్రమాదం జరుగుతోంది. వ్యాపారాలు కొనసాగుతున్న  భవనాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ పొందేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కోరగా కేవలం 500 మంది నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వారిలో వంద మంది మాత్రమే ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకొని సర్టిఫికెట్లు పొందారు. ఆస్తిపన్ను వసూలుపై శ్రద్ధ చూపుతున్న అధికారులు.. ఫైర్ సేఫ్టీ ఏర్పాటుపై చూపడం లేదు. గ్రేటర్​లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ప్రమాదంలో  మరణించిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించి డెడ్ బాడీలను ఇండ్ల తరలిస్తున్నారు తప్ప ఫైర్​ యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాది వరుసగా ఫైర్​ యాక్సిడెంట్లు జరిగినా పట్టించుకోలేదు. సంవత్సర కాలంలో ఐదు చోట్ల జరిగిన ఫైర్​ యాక్సిడెంట్లో 31 మంది మరణించారు. 

వరుసగా అగ్నిప్రమాదాలు

సికింద్రాబాద్ ​ప్రాంతంలో ఇటీవలి కాలంలో వరుస గా అగ్నిప్రమాదాలు సంభవించాయి. ప్రమాదం జరిగినపుడు ఘటనా స్థలాన్ని పర్యటించే నేతలు, అధికారులు.. మరోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. నిరుడు మార్చి23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 11 మంది మృతి చెందారు. అలాగే సికింద్రాబాద్​లోనే రూబీ లాడ్జీలో సెప్టెంబర్ 12న అగ్నిప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. మళ్లీ 4 నెలల్లో సికింద్రాబాద్  ప్రాంతంలోనే డెక్కన్ మాల్  ఫైర్ యాక్సిడెంట్  జరిగి ముగ్గురు మరణించారు. గత నెల 17న ఇదే ప్రాంతంలోని స్వప్నలోక్  కాంప్లెక్స్​లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ నెల రోజుల వ్యవధిలో ఆదివారం కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇవి కాకుండా చిన్నవి, పెద్దవి కలిపి 20కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే, ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదు. 

అనుమతుల్లేని గోదాములపై చర్యలేవీ?

గ్రేటర్​ హైదరాబాద్​లో 70 వేల మంది వ్యాపారు లు ట్రేడ్ లైసెన్స్​లు తీసుకున్నరు. అనుమతులు లేకుండా అంతకు రెట్టింపుగానే రకరకాల దందా లు చేస్తున్నారు.   రెసిడెన్షియల్​ అనుమతులు పొంది చట్టవిరుద్ధంగా గోదాములను ఏర్పాటు చేసుకుం టున్నారు. సికింద్రాబాద్​లోని డెక్కన్ మాల్​లో  కూడా రెసిడెన్షియల్  పర్పస్ కింద  2 ఫ్లోర్లకు మాత్ర మే అనుమతి పొందారు. కానీ, మాల్ బిల్డింగ్​ను స్పోర్ట్స్​ మెటిరీయల్  గోదాం కోసం వినియోగించారు. నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోదాములను ఖాళీ చేయిస్తామని అధికారులు చెబుతున్నా ఆ తరువాత పట్టించుకోవడం లేదు. దీంతో ఫైర్  యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. 

మే లోపు అందరూ  ఫైర్  సేఫ్టీ పెట్టుకోవాలె 

ఫైర్ సేఫ్టీపై ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు వ్యాపారులకు  అవగాహన కల్పిస్తున్నం. ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు కూడా నిర్వహిస్తు న్నం. ట్రేడ్ లైసెన్స్​లు పొందిన ప్రతిఒక్కరూ ఫైర్ సేఫ్టీ  సర్టిఫికెట్ పొందేందుకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలె. మే 31లోపు లైసెన్స్ ఇస్తం. ఫైర్ సేఫ్టీ పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. ఎప్పటికైనా ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోక తప్పదు. 

- ప్రకాశ్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్