స్వాతంత్య్ర వజ్రోత్సవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

స్వాతంత్య్ర  వజ్రోత్సవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

హైదరాబాద్, సికింద్రాబాద్, వెలుగు: స్వాతంత్య్ర వజ్రోత్సవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్, సనత్​నగర్, కంటోన్మెంట్, ఉప్పల్, తార్నాక, ఓయూ తదితర ప్రాంతాల్లో తిరంగా ర్యాలీలు, రన్​లు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో సనత్​నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పాల్గొన్నారు. తర్వాత సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కిషన్​రెడ్డి మాట్లాడుతూ వందేండ్ల పండుగ వరకు ఎవరుఎక్కడ ఉంటామో తెలియదు.. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియదన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ మాజీ మేయర్, బీజేపీ నేతలు బండ కార్తీకరెడ్డి, శ్యాంసుందర్​గౌడ్, మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మొక్కలు నాటారు. ఉప్పల్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మహాంకాళి, ఓయూ తదితర ఠాణాల పోలీసులు 2 కే రన్ నిర్వహించారు.

బియ్యం సేకరణపై హర్షం

తెలంగాణలో 2021–22 రబీ సీజన్​కు సంబంధించి ఎఫ్​సీఐ మరో 8లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్​ రైస్​ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్​కు గురువారం పత్రిక ప్రకటనలో కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ నిర్ణయాలకు ఇది మరో ఉదాహరణ అని అన్నారు. ప్రస్తుతం 6.05 లక్షల టన్నుల బియ్యం కేంద్రం సేకరిస్తోందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఎఫ్ సీఐ వద్ద మూడేండ్లకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.