ఆటోలో EVMలు : చర్యలు తప్పవన్న జాయింట్ కలెక్టర్  

ఆటోలో EVMలు : చర్యలు తప్పవన్న జాయింట్ కలెక్టర్  

జగిత్యాల : ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తంమవుతున్న తరుణంలో..మొన్న ఓ వ్యక్తి ఈవీఎంల దగ్గర నిలబడి ఫొటో దిగడం కలకం సృష్టించగా..ఇప్పుడు ఈవీఎంలు ఆటోలో తరలించడం వివాదంగా మారింది. సోమవారం అర్ధరాత్రి జగిత్యాలలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో… ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై జగిత్యాల ఆర్డీవో వివరణ ఇచ్చారు. ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలు అని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు వీటిని తరలించామని తెలిపారు. ఇవి పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరమేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటి పూట తరలించవచ్చు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

ఈ సంఘటనపై మాట్లాడారు జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్..ఈవీఎంలు తరలించాల్సి వస్తే ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లాలన్నారు. జగిత్యాల తహశీల్దార్ ఆఫీసు నుంచి ప్రభుత్వ వాహనాల్లో కాకుండా, ఆటోల్లో పాత ఈవీఎంలను తరలించడం తప్పేనని చెప్పారు . దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.