లంచం తీసుకుంటూ పట్టుబడిన మాజీ కానిస్టేబుల్
హైదరాబాద్,వెలుగు: ఏసీబీ కానిస్టేబుల్ గా పనిచేశాడు. అవినీతి అధికారులకు సమాచారం అందిస్తూ వసూళ్ళకు పాల్పడి సస్పెండ్ అయ్యాడు. సబ్ రిజిస్టార్ ను బ్లాక్ మెయిల్ చేసి ఏసీబీ వలలో చిక్కాడు. చేవెళ్ళ సబ్ రిజిస్టార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఓంప్రకాశ్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
వివరాల్లోకి వెళ్తే…. గౌండ్ల ఓంప్రకాశ్(40). గతంలో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో కానిస్టేబుల్ గా పనిచేశాడు. తనకు ఏసీబీలో ఉన్న అనుభవంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అధికారులను ట్రాప్ చేసేవాడు.ఉన్నతాధికారులతో చర్చించి కేసులు నమోదు కాకుండా చూస్తానని నమ్మించేవాడు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు రిటైర్ అయ్యేంత వరకు ఏసీబీ సమాచారం అందిస్తానని డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే హెచ్.ఎం.డీ.ఏ మాజీ డైరెక్టర్(ప్లానింగ్) కె.పురుషోత్తమరెడ్డిపై గతేడాది నమోదైన కేసులో కూడా ఓంప్రకాశ్ వసూళ్ళకు పాల్పడ్డాడని ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిన అనంతరం ఉన్నతాధికారులు ఓంప్రకాశ్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత కూడా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదులతో ఓంప్రకాశ్ పై ఏసీబీ నిఘా పెట్టింది.ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ సబ్ రిజిస్టార్ ఎం.ఆర్. రాజేంద్రకుమార్ ను ఓంప్రకాశ్ బ్లాక్ మెయిల్ చేసిన విషయం ఏసీబీకి తెలిసింది. రాజేంద్రకుమార్ సబ్ రిజిస్టార్ కావడంతో అతనికి చెందిన అవినీతి చిట్టా ఏసీబీ వద్ద ఉందని ఓంప్రకాశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాను చెప్పినట్లు చేస్తే ఏసీబీకి చెందిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తానని చెప్పాడు. లేకపోతే అధికారులతో కలిసి ట్రాప్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. ఏసీబీ దాడులు చేయకుండా ఉండాలంటే తనతో పాటు ఉన్నతాధికారులకు కొంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఎస్.ఆర్.ఓ రాజేంద్రకుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏసీబీ హైదరాబాద్ జోన్ టీమ్ ఓంప్రకాశ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పోలీస్ అకాడమీ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ వద్ద రూ.1.5 లక్షలు తీసుకుంటుండగా ఓంప్రకాశ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. నిందితుని వద్ద రూ.1.5 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించింది.
