
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పబ్‌లో ఫ్రెండ్స్‌లో కలిసి అతిగా మద్యం తాగిన మాజీ మంత్రి సమీప బంధువైన ఓ యువకుడు కారు నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సమీప బంధువైన అల్లోల అగ్రజ్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి జీడిమెట్ల పరిధిలోని స్ప్రింగ్ఫీల్డ్కాలనీలో ఉంటున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే అతని ఫ్రెండ్స్ చిద్దన్ తేజ, కార్తిక్‌తో కలిసి తన కారులో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఒక పబ్‌కి వెళ్లారు.
పబ్‌లో మద్యం తాగిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లటం కోసం ఆన్లైన్ లో కారు డ్రైవర్‌ను కూడా బుక్ చేసుకున్నారు. అయితే, ఆ డ్రైవర్ని కారు వెనుక కూర్చోమని చెప్పి అగ్రజ్‌రెడ్డి డ్రైవింగ్ చేశాడు. అర్థరాత్రి 1.30 సమయంలో కేపీహెచ్‌బీకాలనీ ఫోరం మాల్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఉషా ముళ్లపూడి రోడ్డులోని జయనగర్‌లో నివసించే రాజస్థాన్‌కు చెందిన భన్వరిలాల్, ధూర్చంద్.. ఫోరం మాల్లో సినిమా చూసి బైక్‌పై ఇంటికి వెళుతున్నారు. గచ్చిబౌలి వైపు నుంచి రాంగ్ రూట్లో వచ్చిన అగ్రజ్‌రెడ్డి.. ఫోరం సర్కిల్ వద్ద కారుతో వారి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.