నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ కోసం పోలీసులు ‘మోస్ట్ వాంటెడ్’ ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ప్రకటనల్లో నేరస్తుడి ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇచ్చిన ప్రకటనలో తన ఫొటో బాగాలేదని… సెల్ఫీ తీసి ఆ ఫొటోను పోలీసులకు పంపాడు ఓ నిందితుడు. ఈ ఘటన బోస్టన్‌లో జరిగింది.
మాజీ మోడల్ 33 ఏళ్ల స్టెఫెన్ మర్ఫీ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి ఫోటోను వాంటెడ్ లిస్టులో పెట్టారు. అయితే… ఆ ఫోటో స్టెఫెన్‌కు నచ్చలేదు. అంతేకాదు ఆ ఫొటో తన అందాన్ని సరిగా ప్రజెంట్ చేయలేక పోతోందని అనుకున్న స్టీఫెన్ వెంటనే ఓ సెల్ఫీ తీసి పోలీసులకు పంపాడు. తాను ఫుట్‌బాల్ క్రీడాకారుడు డెవిడ్ బెక్‌హమ్ కంటే అందంగా ఉంటానని తెలిపాడు. డాలర్లను ఛాతిపై పెట్టుకున్న మరో ఫోటోకు కూడా పోలీసులకు పంపాడు. ‘కాస్త నా చెత్త ఫోటోలను తొలగించి మంచి ఫోటోలను వాడండి. ఇలాంటి ఫొటోలతో నన్ను గుర్తు పట్టలేరు. ఒకవేళ నేను బోస్టన్‌కు వస్తే మీరు గుర్తుపట్టి పట్టుకోవడం సులభం అవుతుంది కదా’ అని తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఈ విషయాన్ని తెలిపాడు.
