మ్యాచ్ తర్వాత స్టేడియం క్లీన్ చేసిన జపాన్ ఫ్యాన్స్.. మనమైతే ఏం చేసే వాళ్లం..? వీడియో వైరల్ !

మ్యాచ్ తర్వాత స్టేడియం క్లీన్ చేసిన జపాన్ ఫ్యాన్స్.. మనమైతే ఏం చేసే వాళ్లం..? వీడియో వైరల్ !

క్రికెట్ లేదా ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు స్టేడియాలకు వెళ్తుంటాం కదా. మ్యాచ్ జరుగుతుండగా ఏం చేస్తాం. మనం సపోర్ట్ చేస్తున్న టీమ్ కోసం గొంతు చించుకునేలా అరుస్తాం.. పేపర్లు చింపేసి వెదజల్లుతాం.. ఇంకా నానా అల్లరి, హంగామా చేస్తాం కదా. మ్యాచ్ పూర్తయ్యాక ఏం చేస్తాం.. చిప్స్ పాకెట్స్ కవర్స్, కోక్స్ ఎంప్టీ బాటిల్స్.. వగైరా అన్నీ సీట్లపైనా, స్టేడియం అంతటా వదిలేసి వస్తుంటాం కదా. 

కానీ జపాన్ ఫ్యాన్స్ కూడా మనలాగే మ్యాచ్ ఎంజాయ్ చేశారు. అల్లరి చేశారు. విజిల్స్ వేశారు.. తమ టీమ్ కు ఫుల్ సపోర్ట్ చేశారు. మ్యాచ్ పూర్తయ్యాక తమ టీమ్ గెలిచిందనే గర్వం లేకుండా స్టేడియం మొత్తం క్లీన్ చేసి ప్రపంచంలోని కోట్లాది మంది హృదయాలను దోచుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనం ఎలాగో చేయం.. కనీసం వాళ్ల డెడికేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హృదయాలను కదిలించిన ఆరేళ్ల పాప:

2026, మార్చి 31న ఇంగ్లండ్ లోని వెంబ్లీ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్–జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో తమ టీమ్ కు సపోర్ట్ చేసేందుకు జపాన్ ప్లేయర్లు స్టేడియంకు వచ్చారు. ఈ మ్యాచ్ లో జపాన్ 1–0 తేడాతో ఇంగ్లండ్ పై గెలిచింది. మెన్స్ ఫుట్ బాల్ లో మొదటిసారి ఆసియన్ దేశాల నుంచి ఒక టీమ్ ఇంగ్లండ్ ను ఓడించింది. 

కౌరు మితోమా చేసిన గోల్ తో.. విన్నింగ్ విజిల్స్ మోగాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ నిరాశతో సైలెంట్ అయిపోగా.. జపాన్ ఫ్యాన్స్ గెలెపును ఎంజాయ్ చేస్తూనే తమ బాధ్యతను మర్చిపోలేదు. గెలిచాక గోల చేస్తూ.. ప్రత్యర్థి టీమ్ ను తిడుతూ.. అపోజింట్ ఫ్యాన్స్ ను గేలి చేస్తూ.. గొడవలకు దిగుతూ స్టేడియంను వదిలి వెళ్లలేదు. వెంటనే వెళ్లిపోకుండా.. అందరూ వెళ్లే వరకు ఆగి.. తమ సీట్ల ముందు పడి ఉన్న కాగితాలు, పాప్ కార్న్ మగ్స్, ఇతరత్ర చెత్తను కవర్లలో వేసి డస్టుబిన్లలో వేశారు. ఇంగ్లండ్ ఫ్యాన్స్ వెళ్లిపోతున్నా.. ఇది తమ దేశం, తమ స్టేడియం కాకపోయినా ఓపికగా అంతా క్లీన్ చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాలుడు కూడా పెద్ద వారితో పాటు క్లీన్ చేస్తుండటం హృదయాలను కరిగించి వేసిన దృశ్యం.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్ ఫ్యాన్స్ ప్రవర్తన చూసి నెటిజన్లు సలాం చేస్తున్నారు. డిసిప్లిన్, కాండక్ట్, క్వాలిటీస్, జపానీస్ ఫుట్ బాల్ కల్చర్ ను పొగుడుతున్నారు. గతంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో, టోర్నమెంట్లలో కూడా జపాన్ ప్రేక్షకులు ఇలాంటి క్లీనింగ్ చేసి ఆకట్టుకున్నారు. మ్యాచ్ తర్వాత క్లీనింగ్ చేయడం తమ దేశానికి మరింత గౌరవం తెస్తుందని వాళ్లు చెబుతున్నారు. 

సివిక్ సెన్స్ లో మనం ఎక్కడున్నాం..?

సివిక్ సెన్స్ అంటే.. మనం చేసే పనుల వలన ఇతరులకు కలిగే మంచి, చెడులు. అంటే ఇబ్బందులు. ఈ స్టోరీ చదివాక ఏమనిపిస్తుంది. అదే ప్లేస్ లో మనం ఉంటే ఏం చేసేవాళ్లం. IPL, T20 మొదలైన క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్తుంటాం కదా. మన ప్రవర్తన ఎలా ఉంటుందోఇ ఒక సారి రిమైండ్ చేసుకోవాల్సిన టైం. క్లీనింగ్ చేయకపోయినా పర్లేదు.. కనీసం పరిసరాలను చెత్త చేయకూడదనే కామన్ సెన్స్ మన వాళ్లలో చాల వరకు ఉండదు. అలా పడేయొద్దు బ్రో అంటే.. నువ్వెడ్రా నాకు చెప్పడానికి.. అని ఇంకా ఎక్కువ చేస్తుంటాం.

అక్కడ వేయొద్దు అంటే నేను అక్కడే వేస్తా.. ఏం ఇక్కుంటావో ఇక్కో.. అన్నట్లుగా చాలా ర్యాష్ గా ప్రవర్తిస్తుంటాం. అక్కడ ఉమ్మెయొద్దు, అక్కడ పోయొద్దు అని చెప్పినా అదే చేస్తుంటాం. అందుకే స్టేడియంలో గానీ, రోడ్లపై గానీ, సినిమా థియేటర్ లో గానీ.. ఎక్కడ చూసినా చెత్త, చెత్త, చెత్త. డస్ట్ బిన్ లు ఉన్నా మనకు కనబడవు. కానీ జపాన్ ప్రజల సివిక్ సెన్స్ లో మనకు ఒక 25 శాతం వరకు ఉన్నా.. మన పరిసరాలు చాలా వరకు మారిపోతాయి. మీరేమంటారు.