పాలమూరు - రంగారెడ్డి పేరిట విచ్చలవిడి తవ్వకాలు

పాలమూరు - రంగారెడ్డి పేరిట విచ్చలవిడి తవ్వకాలు
  • వట్టెంతో పాటు కర్వెన రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టకూ ఇదే మట్టి
  • పట్టాభూముల్లోనూ గోతులు తీస్తున్న కాంట్రాక్టర్లు
  • అడ్డుకుంటున్న రైతులపై దాడులకు దిగుతున్న లీడర్లు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్, వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లాలో ఇరిగేషన్ కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పొలిటికల్ లీడర్ల అండతో పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట చెరువులను సాఫ్ చేస్తున్నారు.  గ్రామ పంచాయతీలతో తీర్మానం చేయించి విచ్చలవిడిగా నల్లమట్టిని తరలిస్తున్నారు. ఇన్నాళ్లు వట్టెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ట కోసమేనని చెప్పిన ఆఫీసర్లు.. ఇప్పుడు మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కర్వెన రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టకు కూడా తీసుకెళ్తున్నారు.  చెరువుల పక్కనే పట్టా భూములను కూడా వదలడం లేదని ఆరోపణలు ఉన్నాయి.  రైతులు ఎవరైనా అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. 

వట్టెం కోసం పాలెం చెరువుకు ఎసరు
వట్టెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆరు గ్రామాలకు జీవనాధారంగా ఉండే పాలెం పెంటోని చెరువుకు ఎసరు పెట్టారు. 600 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువు నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్ల నల్లమట్టి తీసేందుకు ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.  సర్కారు రేట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం రూ.80 లక్షలు చెల్లించి పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఏకంగా 40 లక్షల క్యూబిక్ మీటర్ల నల్లమట్టిని తరలించింది. పాలెంతో పాటు  కేసరి సముద్రం, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజీపేట మండలాల్లోని చెరువులదీ ఇదే పరిస్థితి.  ఒక్కో చెరువు నుంచి ప్రతిరోజు 100కు పైగా టిప్పర్లు 24 గంటల పాటు నడుస్తున్నాయి. 

ఇప్పుడు కర్వెనకు..
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలంలో నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ కట్టకు నల్లమట్టి తరలించేందుకు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం  బిజినేపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, తెల్కపల్లి, ఊర్కొండ మండలాల్లోని చెరువులను టార్గెట్ చేశారు.  ఇప్పటికే తిమ్మాజీపేట మండలం ఆవంచ, పాపగల్లు, ఐతోలు, ఇప్పలపల్లి, ఇప్పలపల్లితాండా చెరువులో నుంచి తీసిన మట్టిని  నేరెళ్లపల్లి గ్రామంలో స్టాక్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా కర్వెన రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిస్తున్నారు.  ఊర్కొండ మండలం గుడిగాన్‌‌‌‌‌‌‌‌పల్లి  చెరువు నుంచి 2 నెలల పాటు విరామం లేకుండా నల్లమట్టిని తరలించారు.  కాగా, కర్వెనకు సంబంధించిన పర్మిషన్‌‌‌‌‌‌‌‌, క్యూబిక్ మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంత అనే వివరాలకు ఆఫీసర్లు బయటికి చెప్పడం లేదు. 

తీర్మానాలు.. బెదిరింపులు
చెరువుల నుంచి నల్లమట్టి తీసేందుకు ఇరిగేషన్ పర్మిషన్‌‌‌‌‌‌‌‌తో పాటు జీపీ తీర్మానం తప్పనిసరి కావడంతో కాంట్రాక్టర్లు గ్రామ ప్రజాప్రతినిధులు, లీడర్లను మేనేజ్ చేస్తున్నారు. దేవాలయాలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల కోసం రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ఇస్తామని తీర్మానం చేయిస్తున్నారు. లీడర్లకు కూడా ముట్టజెప్తుండడంతో వాళ్లు కాంట్రాక్టర్లకే సపోర్ట్ చేస్తున్నారు.  నల్లమట్టి తరలింపును ఎవరైనా అడ్డుకుంటే కేసులు పెట్టించడంతో పాటు దాడులు చేస్తున్నారు. బిజినేపల్లి మండలం మంగనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నల్లమట్టి తీయొద్దన్నందుకు రైతు రాములుపై దాడి చేశారు. అంతేకాదు చెరువులతో పాటు పట్టా పొలాల్లోకి ప్రొక్లేయినర్లు దింపి గోతులు పెడుతున్నారు. ఇదేందని అడిగితే  రైతులను దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు కన్నెత్తి కూడా చూడడం లేదు. 

రూల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ..
మట్టి తరలింపులో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ రూల్స్ ప్రకారం 1.5 మీటర్ల కంటే ఎక్కువ  లోతు తీయవద్దు.  కానీ,  టిప్పర్లు మునిగిపోయేలా చెరువులను తవ్వేశారు. ప్రభుత్వం వట్టెం కోసం క్యూబిక్ మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నల్లమట్టికి  రూ.550గా రేట్‌‌‌‌‌‌‌‌ ఫిక్స్ చేసింది.  కాంట్రాక్ట్  తీసుకున్న ఏజెన్సీలు  కేవలం రూ.100 లోపే సబ్ లీజుకు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి.  జిల్లాలో ఇప్పటి వరకు  రూ.40 కోట్ల మట్టి దందా జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.