అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
  • మూడు ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపై కసరత్తు
  • ఒకటీ రెండు రోజుల్లో కాంగ్రెస్​ సెకండ్​ లిస్టు
  • ఇప్పటికే నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
  • 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు
  • ఇందులో 6 స్థానాలపై పార్టీ సీఈసీలో ఏకాభిప్రాయం
  • హైదరాబాద్​లో అనూహ్యంగా తెరపైకి లాయర్​ తబస్సుమ్​
  • ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లను ఖరారు చేసిన బీజేపీ
  • ఖమ్మం, వరంగల్​ సీట్లు పెండింగ్​.. రేపు ప్రకటించే చాన్స్​
  • ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను వెతుకుతున్న బీఆర్​ఎస్​
  • పోటీకి దూరంగా ముఖ్య నేతలు.. ఇతర పార్టీల వైపు చూపు
  • ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల విముఖత

హైదరాబాద్​, వెలుగు : లోక్​సభ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల కావ డంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ విషయంలో బీజేపీ కొంచెం స్పీడ్​తో ఉండగా.. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల్లో మాత్రం ఇంకా పలు స్థానాలపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్​ టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో ఆ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్​సభ స్థానాలకు గాను ఇటీవల ఫస్ట్​ లిస్టులో నాలుగు సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్​ హైకమాండ్​ ఖరారు చేసింది. మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేలు, సామాజిక సమీకరణల ఆధారంగా క్యాండిడేట్లను హైకమాండ్​ ఖరారు చేస్తున్నది. బీఆర్​ఎస్​ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నది. సిట్టింగ్​ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లో జాయిన్​ అవుతుండటం, లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలు వెనుకడుగు వేస్తుండటంతో క్యాండిడేట్ల కోసం  గులాబీ టీమ్  ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఖరారైనప్పటికీ వారిలోనూ కొందరు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం నడుస్తున్నది.  బీజేపీ 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉన్నది. మరో రెండు స్థానాలను ప్రకటించాల్సి ఉన్నది. అయితే, ఎన్నికల షెడ్యూల్​ రావడంతో త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామని ఆశావహులు అంటున్నారు. గురువారం కాంగ్రెస్​ సీఈసీ మీటింగ్​ను నిర్వహించనుండగా.. శుక్రవారం బీజేపీ కూడా పార్లమెంటరీ కమిటీ మీటింగ్​ను ఏర్పాటు చేసి మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్​లో పోటీ ఫుల్​

నల్గొండ, మహబూబ్​నగర్​, మహబూబాబాద్​, జహీరాబాద్​ సీట్లకు ఫస్ట్​ లిస్టులో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు నడుస్తున్నది. మంగళవారం జరిగిన కాంగ్రెస్​ పార్టీ సీఈసీ మీటింగ్​లో చేవెళ్ల (రంజిత్​ రెడ్డి), నాగర్​కర్నూల్​ (మల్లు రవి),  పెద్దపల్లి (గడ్డం వంశీ కృష్ణ), ఆదిలాబాద్​(ఆత్రం సుగుణ), మల్కాజ్​గిరి (పట్నం సునీతా రెడ్డి), సికింద్రాబాద్​ (దానం నాగేందర్​) స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తున్నది.  ఏడు స్థానాల్లో మాత్రం పీటముడులున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ స్థానాల్లో ఆశావాహులు ఎక్కువ మంది ఉండటంతో సామాజిక సమీకరణాలు, సర్వేలో విన్నింగ్​ పర్సంటేజీలను బేస్​ చేసుకొని క్యాండిడేట్స్​ను ఖరారు చేసేందుకు కాంగ్రెస్​ నాయకత్వం చర్చలు జరుపుతున్నది. ఖమ్మం టికెట్​ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  తమ్ముడు ప్రసాద్​ రెడ్డి మధ్య పోటీ ఉంది. 

అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ స్థానం దాదాపు పొంగులేటి ప్రసాద్​రెడ్డికే ఖాయమైందన్న టాక్​ వినిపిస్తున్నది. నాగర్​కర్నూల్​ టికెట్​ను భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి ఇస్తామని సీఈసీలో పార్టీ పెద్దలు చెప్పారని, దీంతో భట్టి కుటుంబంలో ఒకరికి ఎంపీ టికెట్ (మల్లు రవికి)  దాదాపు ఖరారైనందున ఖమ్మం స్థానంలో మల్లు నందినికి టికెట్​ ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవిని బరిలోకి దింపే చాన్స్​ ఉండంటంతో ఇదే స్థానం నుంచి టికెట్​ ఆశిస్తున్న సంపత్​ కుమార్​కు నిరాశ తప్పేలా లేదని ఆ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి టికెట్​ కోసం కూడా ఇద్దరు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భార్య లక్ష్మి, పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు. సర్వేల ప్రకారం లక్ష్మి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్​ సర్కిల్స్​లో చర్చ నడుస్తున్నది. 

హైదరాబాద్​ స్థానంలో తెరపైకి కొత్త పేరు!

హైదరాబాద్​ ఎంపీ టికెట్​ విషయంలో కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచి అలీ మస్కతీ పేరును పరిశీలిస్తున్నది. అయితే ఇప్పుడు ఓ మహిళా అడ్వకేట్​ పేరు తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు అడ్వకేట్​గా ఉన్న షానవాజ్​ తబసుమ్​కు టికెట్​ ఇచ్చే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్​ వర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. కాంగ్రెస్​ సీఈసీ మీటింగ్​లోనూ ఆమె పేరు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఆలిండియా ఆజాద్​ కాంగ్రెస్​ పార్టీకి వ్యవస్థాపకురాలైన షానవాజ్​ తబసుమ్​కు టికెట్​ ఇచ్చి బరిలోకి దింపితే మహిళా సెంటిమెంట్, ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

  •     మల్కాజ్​గిరి కాంగ్రెస్​ టికెట్​ పట్నం సునీతా రెడ్డికి ఖాయమని భావిస్తున్నా.. కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పార్టీ టికెట్​ కోసం  ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. 
  •     ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్​ను సికింద్రాబాద్​ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నా.. ఇప్పటికే ఆ సీటు కోసం జీహెచ్​ఎంసీ మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ ప్రయత్నాలు చేస్తున్నారు. 
  •     నిజామాబాద్​ నుంచి ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, కరీంనగర్​ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ స్థానాలకు అభ్యర్థుల్లో మార్పులుండే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. నిజామాబాద్​ టికెట్​ కోసం ఆరెంజ్​ ట్రావెల్స్​ ఓనర్​ సునీల్​రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు.
  •     వరంగల్​ టికెట్​ పసునూరి దయాకర్​కు ఇచ్చే యోచనలో కాంగ్రెస్​ హైకమాండ్​ ఉన్నట్టు సమాచారం. 
  •     ఆదిలాబాద్​లో ఆత్రం సుగుణకు ఇవ్వాలని అనుకుంటున్నా.. ఆదివాసీ డాక్టర్​ అయిన సుమలత పేరు కూడా వినిపిస్తున్నది.  

వరంగల్​, ఖమ్మం బీజేపీ అభ్యర్థులు ఎవరో?

వరంగల్​, ఖమ్మం స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయినట్టే. బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను వరంగల్​ అభ్యర్థిగా ప్రకటించే చాన్స్​ ఉంది. అయితే, ఆ స్థానం నుంచి పోటీ చేయాలని రిటైర్డ్​ ఐపీఎస్​ కృష్ణ ప్రసాద్​ ఆశలు పెట్టుకున్నారు. తనకు టికెట్​ ఇవ్వాలని బీజేపీ పెద్దలను ఆయన కోరుతున్నారు. మరో స్థానం ఖమ్మంపై మాత్రం పార్టీలో సందిగ్ధత నెలకొంది.  మాజీ సీఎం జలగం వెంగళ్రావు కుమారుడు జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరారు. ఖమ్మం టికెట్​ వెంకట్రావుకే ఇస్తారని భావిస్తున్నప్పటికీ .. తెరపైకి కొత్తవారిని తెచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ నామా నాగేశ్వర రావును పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్​ఇవ్వొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్​లో ప్రకటించే అవకాశం ఉంది.