పాక్ బార్డర్కు సమీపంలో.. ఇండియన్ ఆర్మీ ‘మరుజ్వాలా’ డ్రిల్స్

పాక్ బార్డర్కు సమీపంలో.. ఇండియన్ ఆర్మీ ‘మరుజ్వాలా’ డ్రిల్స్

జైపూర్: త్రివిధ దళాల త్రిశూల్ ఎక్సర్‌‌సైజ్‌‌లో భాగంగా ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ రాజస్తాన్‌‌లోని జైసల్మేర్‌‌( థార్ ఎడారి)లో  "ఎక్సర్‌‌సైజ్ మరుజ్వాలా" విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విన్యాసంలో ఇండియన్ ఆర్మీ, వాయుసేన, నౌకాదళాల మధ్య గల అసాధారణమైన సమన్వయం, ఆధునిక యుద్ధ ప్రమాణాలను చాటాయి. 

భారత్- పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో జరిగిన ఈ డ్రిల్‌‌లో.. పారాచూట్ జంప్స్, డ్రోన్ దాడులు, రోబోటిక్ ఆపరేషన్లను విజయవంతంగా ప్రదర్శించారు. థార్ రాప్టర్ బ్రిగేడ్, సుదర్శన్ చక్ర నుంచి ట్యాంకులు ఈ ఎక్సర్‌‌సైజ్‌‌లో పాల్గొన్నాయి. హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. పారా స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన 200 మంది 10 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న హెలికాప్టర్ల నుంచి జంప్ చేశారు. 

100కి పైగా  స్వదేశీ మైక్రో డ్రోన్లతో ఒకేసారి ఏఐ -ఆధారిత టార్గెట్ లాక్ తో శత్రు బంకర్లపై కామికేజ్ అటాక్ చేశారు. డీఆర్డీవోకు చెందిన డాక్ రోబో శత్రు ఐఈడీలను గంటకు 8 కి.మీ.వేగంతో స్కాన్ చేసి, వాటర్ జెట్ తో డిఫ్యూజ్ చేసింది. స్వార్మ్ రోబోట్స్  శత్రు ట్రెంచ్‌‌లోకి చొరబడి, దాక్కున్న సైనికులను థర్మల్ సెన్సార్లతో గుర్తించడం వంటి డ్రిల్స్ ఆకట్టుకున్నాయి.