V6 News

తమిళనాడులో డీఎంకే.. బెంగాల్లో హోరాహోరీ.. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల

తమిళనాడులో డీఎంకే.. బెంగాల్లో హోరాహోరీ.. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • అస్సాంలో బీజేపీ.. కేరళలో యూడీపీకే ఎగ్జిట్ పోల్స్లో పట్టం
  • పుదుచ్చేరిలోనూ మారని పవర్.. మళ్లీ ఎన్డీయేకే గెలుపు చాన్స్ 
  • తమిళనాడులో నటుడు విజయ్ టీవీకే పార్టీ స్వల్ప ప్రభావం 
  • నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • వెస్ట్​ బెంగాల్​ చివరి దశలో 92.47 శాతం పోలింగ్​ నమోదు
  • మే 4న కౌంటింగ్.. ఆ రోజే తేలనున్న అసలు ఫలితాలు

న్యూఢిల్లీ: తమిళనాడులో డీఎంకే కూటమి, అస్సాంలో బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే కూటమికే పవర్ దక్కుతుందని వెల్లడించాయి.  కేరళంలో అధికార ఎల్డీఎఫ్ కూటమి గద్దె దిగే అవకాశాలు ఉన్నాయని.. ప్రతిపక్ష యూడీఎఫ్ పవర్ ను చేజిక్కించుకునే చాన్స్ ఉందని పేర్కొన్నాయి.

ఇక వెస్ట్ బెంగాల్ లోనూ అధికార మార్పిడి జరగొచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. బెంగాల్ ప్రజలు ఈసారి టీఎంసీని దింపేసి.. బీజేపీకి అధికారం కట్టబెట్టే చాన్స్ ఉందని పేర్కొన్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ మేరకు బుధవారం సాయంత్రం బెంగాల్​లో తుది విడత పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలయ్యాయి.

అస్సాంలో మళ్లీ బీజేపీకే పవర్
అస్సాంలో మళ్లీ బీజేపీ కూటమికే మళ్లీ అధికారం దక్కుతుందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 సీట్లు ఉండగా, అధికారం చేపట్టేందుకు 64 సీట్ల కనీస మెజార్టీ అవసరం. బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై ముప్పై సీట్లు అధికంగానే గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకోనుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ కూటమి దాదాపుగా 20 నుంచి 30 సీట్లకు అటూఇటూ గెలుచుకుని రెండో స్థానానికి పరిమితం కావచ్చని అంచనా వేశాయి. బీజేపీ కూటమికి అత్యధికంగా 88 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా, జేవీసీ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి.

కేరళం యూడీఎఫ్దే.. 

కేరళంలో ఈసారి సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి గద్దె దిగడం ఖాయమని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుని, అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని తేల్చాయి. కేరళం అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 71 సీట్లు అవసరం. యూడీఎఫ్ కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే చాన్స్ ఉందని 5 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 

కేరళంలో కాంగ్రెస్ గెలిస్తే..
దక్షిణాదిన ఇప్పటికే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులోనూ అధికార డీఎంకే కూటమిలో మిత్రపక్షంగా ఉంది. తమిళనాడులో మరోసారి డీఎంకే కూటమిదే గెలుపు అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. కేరళంలోనూ కాంగ్రెస్ కూటమి గెలిస్తే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య నాలుగుకు చేరుతుంది. దక్షిణాది వరకూ కాంగ్రెస్ బలమైన పార్టీగా అవతరించే అవకాశం ఉంది.

తమిళనాడులో మళ్లీ డీఎంకేనే..
తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనుందని ఏడు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. కొత్తగా వచ్చి, ఎన్నికల బరిలో దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈసారి అధికార డీఎంకేకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సంస్థ వెల్లడించింది. 

టీవీకే 67 నుంచి 81 సీట్లను గెలుచుకోవచ్చని కామాఖ్య అనలైటిక్స్ అంచనా వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, అధికారాన్ని చేపట్టేందుకు కనీసం 118 సీట్లు అవసరం. అయితే, ఈ మ్యాజిక్ ఫిగర్ ను డీఎంకే పార్టీ ఈజీగానే దాటుతుందని ఆరు ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. డీఎంకే 125 నుంచి 145 సీట్లు గెలిచి, అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని పీపుల్స్ పల్స్ సంస్థ పేర్కొంది. అన్నాడీఎంకే 65 నుంచి 80 సీట్లకు పరిమితం కానుందని.. టీవీకే 18 నుంచి 24 సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడించింది. 

పుదుచ్చేరిలోనూ ఎన్డీయేదే పవర్  
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలు అవసరం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈజీగానే మ్యాజిక్ ఫిగర్ చేరుతుందని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి గరిష్టంగా 12 సీట్లకు పరిమితం కావచ్చని ఐదు సంస్థలు అంచనా వేశాయి.  

అసలు ఫలితాలు తేలేది మే 4వ తేదీనే.. 
ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు కావడం తరచూ జరిగేదే. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బెంగాల్​లో మమత సర్కారు గద్దె దిగే చాన్స్ ఉందని ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. కానీ అసలు ఫలితాలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. అయితే, ఈ నాలుగు రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల కౌంటింగ్ ను ఈసీ మే 4వ తేదీన చేపట్టనుంది. దీంతో అసలు ఫలితాలు ఆ రోజునే తేలనున్నాయి.

బెంగాల్లో బీజేపీనా? టీఎంసీనా? 
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు సాగింది. అయితే, టీఎంసీ చీఫ్ మమత పాలనకు ఈసారి బీజేపీ చరమగీతం పాడనుందని ఐదు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేశాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 148 సీట్లు అవసరం. 

ఈసారి బెంగాల్ లో బీజేపీ జెండా ఎగిరే చాన్స్ ఉందని.. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే 5 నుంచి 20 సీట్ల దాకా ఎక్కువగానే గెలుచుకోవచ్చని ఐదు సంస్థలు తేల్చిచెప్పాయి. టీఎంసీ ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అంచనా వేశాయి.