- కేరళ వరదల రియల్ హీరో ‘రాజేశ్’
తిరువనంతపురం: వరదల్లో చిక్కుకున్న ఓ రైతు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన రక్షకుడు చివరకు అదే వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. తన లైఫ్ జాకెట్‌ను రైతుకు ఇచ్చి అతడిని సురక్షితంగా పంపించిన 36 ఏళ్ల రాజేశ్.. కేరళలో వీర మరణం పొందాడు. కన్నూర్ జిల్లా మీంతుల్లి ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తిరువనంతపురంలోని కల్లియూర్‌కు చెందిన ఆర్. రాజేశ్ ఈత, రాపెల్లింగ్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.
భారీ వర్షాలతో వరదలు రావడంతో అక్కడ చిక్కుకున్న 61 ఏళ్ల రైతు బెన్నీని రక్షించేందుకు తన సహచరులు షిబిన్, జితిన్‌తో కలిసి సహాయక చర్యలకు వెళ్లాడు. కరియంగోడ్ నదిని దాటి రైతు వద్దకు చేరుకున్న రక్షక బృందం.. అతడిని తిరిగి తీసుకొస్తుండగా బెన్నీ ఇబ్బంది పడడాన్ని రాజేశ్ గమనించాడు.
వెంటనే తన లైఫ్ జాకెట్‌ను తీసి వృద్ధ రైతుకు తొడిగాడు. అనంతరం భద్రతా తాడును పట్టుకుని ఒడ్డుకు వస్తుండగా బలమైన ప్రవాహానికి పట్టు కోల్పోయి నీటిలో కొట్టుకుపోయాడు. రాజేశ్ 2018 కేరళ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నాడు. 2024లో వయనాడ్ కొండచరియల విపత్తు సమయంలోనూ సహాయక బృందాలతో కలిసి పనిచేశాడు.
అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీ సభ్యుడిగా తాడు రక్షణ, నీటి భద్రతపై పలువురికి శిక్షణ ఇచ్చాడు. రాజేశ్ త్యాగంపై కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఓ వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు.
