కూరగాయల రేట్లు మరో నెలదాక ఇంతే!

కూరగాయల రేట్లు మరో నెలదాక ఇంతే!
  • కూరగాయల రేట్లు మరో నెలదాక ఇంతే!
  • 20 రోజులుగా టమాట, మిర్చి కిలో వందకు పైగానే
  • ఇతర కూరగాయలు కిలో రూ.60 నుంచి రూ.180 వరకు
  • ఆకుకూరల రేట్లూ భగ్గుమంటున్నయి 
  • సమ్మర్​లో చెడగొట్టు వానలతో పంటలపై ఎఫెక్ట్​
  • నార్త్​లో వర్షాలతో తగ్గిన దిగుమతులు
  • రాష్ట్రంలో పంటలు చేతికొచ్చేందుకు ఇంకో నెల

హైదరాబాద్, వెలుగు : కొద్ది రోజులుగా భగ్గుమంటున్న కూరగాయల రేట్లు మరో నెల పాటు ఇలాగే కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు. 20 రోజులుగా టమాట, మిర్చి ధర కిలో వంద రూపాయలకు పైగానే ఉండగా, ఇతర కూరగాయల రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో లేవు. ఏటా ఈ సమయంలో కూరగాయల రేట్లు అందరికి అందుబాటులో ఉండేవి. కానీ ఈ సారి రేట్లు భగ్గుమంటున్నాయి. ఎండాకాలంలో చెడగొట్టు వానలకు చేతికొచ్చిన కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వానలు ఆలస్యమవడంతో సాగు లేటై ఇంకా కూరగాయలు చేతికిరాలేదు. హైదరాబాద్ కు కూరగాయలు ఎక్కువగా ఎపీ, కర్నాటక, మహరాష్ట్ర, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి అవుతాయి. నార్త్ లో వర్షాల కారణంగా అక్కడ కూరగాయలకు డిమాండ్ పెరిగింది. రేట్లు ఎక్కువగా వస్తుండటంతో మన రాష్ట్రానికి కూరగాయలు ఎగుమతి చేసేవారిలో కొందరు నార్త్​కు పంపుతున్నారు. దీంతో ఇక్కడ డిమాండ్​పెరిగి కూరగాయల రేట్లు అమాంతం పెరిగాయి.

అన్నింటి రేట్లు పెరిగినయ్ 

ప్రస్తుతం ఏ కూరగాయలు కొందామన్న కిలో ధర రూ.60 కిపైగా ఉంది. ఎక్కువగా వినియోగించే టమాట, మిర్చి రేట్లైతే భగ్గుమంటున్నాయి. సిటీలో రైతుబజార్లలో కిలో టమాట రూ.75 ఉండగా, బయటి మార్కెట్లో కిలో రూ.140, సూపర్ మార్కెట్లలో రూ.180 వరకు ఉంది. అలాగే మిర్చి రేట్లు చూస్తే రైతుబజార్లలో కిలో రూ.85 ఉండగా, బయటి మార్కెట్లో రూ.140, సూపర్ మార్కెట్లలో రూ.160గా ఉంది. బీన్స్ ధర కూడా రైతుబజార్లలో కిలో రూ.95 ఉండగా, బయటి మార్కెట్లో రూ.130కి పైగానే ఉంది. చిక్కుడు, బెండకాయలు, బీరకాయలు కూడా రైతుబజార్లలో రూ.50లోపు ఉన్నప్పటికీ బయటిమార్కెట్లో మాత్రం రూ.60కిపైగానే అమ్ముతున్నారు.

ఆకు కూరలు సగమే వస్తున్నయ్ 

హైదరాబాద్ సిటీలో రోజు దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయలు అమ్ముడవుతాయి. ప్రస్తుతం 500 టన్నులు మాత్రమే సిటీ మార్కెట్లకు వస్తున్నాయి. ఆకుకూరలు అయితే 50 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. నెలరోజుల కిందటి వరకు అన్ని రకాల ఆకు కూరలు రూ.10కి ఐదారు కట్టలు ఉండగా.. ఇప్పుడు ఒకటి, రెండు కట్టలు మాత్రమే వస్తున్నాయి. సాధారణ రోజుల్లో సిటీలోని మార్కెట్లలో అన్ని రకాల ఆకుకూరలు దాదాపు 150 టన్నులు వచ్చేవి. ప్రస్తుతం 80 టన్నుల లోపే వస్తున్నాయని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.

సాగు ఆలస్యమైంది 

వర్షాలు టైమ్​కు పడకపోవడంతో పంటలు ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం అన్ని కూరగాయలు సాగు అవుతున్నాయి. పంట వచ్చేసరికి నెలరోజులు పట్టేలా ఉంది. లోకల్ టమాట మార్కెట్ కు వచ్చేందుకు నెల నుంచి నెలన్నర పట్టేలా ఉంది. మదనపల్లి, చిత్తూర్, అనంతరంపురం నుంచి టమాట దిగుమతి అయ్యేది. కానీ నార్త్ ఇండియాలో వర్షాల వల్ల  అక్కడ డిమాండ్ ఉండటంతో వారు నార్త్ కు పంపుతున్న ట్లు తెలుస్తున్నది. దీంతో దిగుమతులు తగ్గి రేట్లపై ప్రభావం పడింది. సమ్మర్ లో వేసిన పంటలు అప్పట్లో కురిసి  వర్షాలకు పోయాయి. ఆ ప్రభావం ఇప్పుడు చాలా ఉంది.

- డాక్టర్ సునందరెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా

వచ్చే నెల నుంచి మన కూరగాయలు 

మన దగ్గర రైతులు వేసిన కూరగాయల పంట వచ్చేనెల మొదటి వారంలో చేతికొచ్చే అవకాశం ఉంది. హోల్ సేల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ కు సరిపడా కూరగాయలు రాకపోవడంతో రేట్లపై ప్రభావం పడుతోంది. మేం హోల్ సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి గ్రూప్ ల ద్వారా విక్రయిస్తున్నం. బయటి మార్కెట్లతో పోలిస్తే రైతుబజార్లలో రేట్లు తక్కువగా ఉన్నాయి.

- విజయ్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్, మెహిదీపట్నం రైతుబజార్